ఎగిరే ట్యాక్సీలొస్తున్నాయ్..!
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:00 AM
పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా.. దుబాయ్ తన ప్రతిష్ఠాత్మక ఎయిర్ ట్యాక్సీ ప్రాజెక్టును వేగవంతం చేసింది. దీనిలో...
ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ రెడీ
దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఏర్పాటు
ఈ ఏడాది చివరికి సేవలు అందుబాటులోకి
45 నిమిషాల ప్రయాణం.. 10 నిమిషాల్లోనే పూర్తి
ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేలా కీలక ముందడుగు
దుబాయ్, ఏప్రిల్ 17: పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి.. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా.. దుబాయ్ తన ప్రతిష్ఠాత్మక ఎయిర్ ట్యాక్సీ ప్రాజెక్టును వేగవంతం చేసింది. దీనిలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ స్టేషన్.. ఈ ఏడాది చివరి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని వెల్లడించింది. దుబాయ్ ఎయిర్ ట్యాక్సీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం నాలుగు స్టేషన్లను నిర్మిస్తున్నారు. వాటిలో మొదటిది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయగా.. డౌన్‌టౌన్ దుబాయ్, పామ్ జుమేరా, దుబాయ్ మెరీనాల్లో నిర్మిస్తున్న స్టేషన్లను కూడా ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నగరంలోని కీలక ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన పర్యాటక ప్రదేశాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంచనుంది. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం మొదటి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్‌ను సందర్శించారు. నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.
ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ ప్రత్యేకతలివే..
దుబాయ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ ఇది. నగరంలోని ఎయిర్ ట్యాక్సీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
3100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన నాలుగంతస్తుల భవనంలో.. రెండు స్థాయిల్లో కార్ పార్కింగ్, రెండు ఎయిర్ ట్యాక్సీ టేకాఫ్, ల్యాండింగ్ ప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
ఏడాదికి 1.7 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, పామ్ జుమేరా మధ్య దూరం 36 కిలోమీటర్లు. కారులో చేరుకోవాలంటే దాదాపు 45 నిమిషాలు పడుతుంది. ఎయిర్ ట్యాక్సీల్లో అయితే 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ఎయిర్ ట్యాక్సీ వాహనం గంటకు 321 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అంచనా.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..