Share News

30 సంవత్సరాలుగా అవరోధాలే!

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:08 AM

దేశంలోని చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ అంశం ఈనాటిది కాదు. దీని వెనుక మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. లోక్‌సభలో, అసెంబ్లీల్లో మహిళలకు సీట్లను రిజర్వు చేసే బిల్లును తొలిసారిగా 1996లో...

30 సంవత్సరాలుగా అవరోధాలే!

  • 1996లో తొలిసారిగా మహిళా బిల్లు.. ఓబీసీ కోటా లేకపోవడంపై వ్యతిరేకత

  • వాజపేయి పాలనలో పలుమార్లు బిల్లు ఆమోదానికి విఫల యత్నాలు

  • మన్మోహన్‌పాలనలో రాజ్యసభ ఆమోదం

  • మోదీ హయాంలో చట్టమైంది.. కానీ..

దేశంలోని చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ అంశం ఈనాటిది కాదు. దీని వెనుక మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. లోక్‌సభలో, అసెంబ్లీల్లో మహిళలకు సీట్లను రిజర్వు చేసే బిల్లును తొలిసారిగా 1996లో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో 13 పార్టీలతో కూడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. వివిధ పార్టీల నేతలు సుముఖంగా లేకపోవటంతో.. మహిళా బిల్లును సమీక్షించటానికి సీపీఐ నాయకురాలు గీతాముఖర్జీ సారథ్యంలోని సంయుక్త కమిటీకి సిఫారసు చేశారు. ఈ కమిటీ తన నివేదికలో పలు సూచనలు చేసింది. ‘చట్టసభల్లో మహిళలకు దాదాపు మూడోవంతు రిజర్వేషన్‌’ అనే పదం బదులు ‘మూడోవంతుకు తగ్గకుండా రిజర్వేషన్‌’ అనే పదం చేర్చాలని, రాజ్యసభలో కూడా కోటా ఇవ్వాలని, ఓబీసీలకూ ప్రాతినిధ్యం ఇవ్వాలని పేర్కొంది. వీటిలో కొన్ని అంశాలను చేర్చి కొత్తగా బిల్లును తీసుకొచ్చినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ బిల్లు వల్ల పట్టణాలకు చెందిన, విద్యావంతులైన స్త్రీలకు మాత్రమే లాభం చేకూరుతుందని, గ్రామీణ మహిళలకు ఎటువంటి ఉపయోగం లేదని శరద్‌ యాదవ్‌ విమర్శలు గుప్పించారు. బిల్లులో ఎస్సీ, ఎస్టీ కోటా ఉన్నట్లుగానే ఓబీసీ కోటాను చేర్చాలని, లేకపోతే మహిళా రిజర్వేషన్‌ వల్ల అగ్రకులాలకు చెందిన మహిళలకు మాత్రమే లాభం చేకూరుతుందని నితీశ్‌ తదితరులు వాదించారు. ఈ విధంగా మహిళా రిజర్వేషన్‌ అంశంలో ముందడుగు పడలేదు.

వాజపేయి హయాంలో..

1998 నుంచి 2004 వరకూ కొనసాగిన వాజపేయి సారథ్యంలోని ఎన్‌డీఏ సర్కారు హయాంలో మహిళా బిల్లు ఆమోదం కోసం పలు ప్రయత్నాలు జరిగాయి. 1998 జూలై 13వ తేదీన లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి తంబిదురై మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు.. లాలా ప్రసాద్‌ యాదవ్‌ సారథ్యంలోని ఆర్జేడీ, ములాయంసింగ్‌ యాదవ్‌ సారథ్యంలోని ఎస్పీ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఓబీసీ కోటా లేకుండా మహిళా బిల్లును ఆమోదించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో బిల్లు తెచ్చే ప్రయత్నాలను లోక్‌సభలో మమతా బెనర్జీ గట్టిగా అడ్డుకున్నారు. బీఎస్పీ, ముస్లిం లీగ్‌ తదితర పార్టీలు కూడా బిల్లును సమర్థించలేదు. పాలకపక్షమైన ఎన్‌డీఏలో కూడా అభిప్రాయబేధాలు పొడసూపాయి. మళ్లీ 1999 డిసెంబరులో బిల్లును తీసుకొనిరాగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. 2000, 2002, 2003లలో కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో వాజపేయి ప్రభుత్వం మహిళా బిల్లును ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిందిగానీ సఫలం కాలేదు. దీనిపై అఖిలపక్ష సమావేశం జరిపినా కూడా ఏకాభిప్రాయం కుదరలేదు.


మోదీ హయాంలో..

నరేంద్రమోదీ రెండో దఫా ప్రభుత్వ హయాంలో 2023లో.. కొత్త పార్లమెంటు భవనంలో ప్రత్యేక సమావేశాలు జరిపి మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. ‘నారీ శక్తి వందన్‌ అభియాన్‌’ పేరిట పలు సవరణలతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదంతో మహిళా బిల్లు తొలిసారిగా చట్టరూపం దాల్చింది. అయితే, దీంట్లో ఉన్న సవరణల ప్రకారం.. 2026 తర్వాత జరిగే తొలి జనగణన అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఈ చట్టం అమలవుతుంది. లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు చేస్తారు.

15 ఏళ్లపాటు చట్టం అమలులో ఉంటుంది. ఆ తర్వాత కావాలనుకుంటే పార్లమెంటు ఈ చట్టాన్ని పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్నాళ్లో ఎదురుచూసిన మహిళా బిల్లు సాకారమైనా.. ఆచరణలోకి రాలేదు. ప్రస్తుతం ఈ బిల్లులో మళ్లీ సవరణలు చేసి.. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, దీనిని నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టటంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ అంశం మరోసారి పెండింగులోనే పడిపోయింది.

సెంట్రల్‌ డెస్క్‌

మన్మోహన్‌ వచ్చినా ముందడుగు పడలేదు..

2004లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన యూపీఏ కూటమి ప్రభుత్వం అదే ఏడాది మే 1వ తేదీన మహిళా బిల్లు పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, దానిని తప్పకుండా అమలుచేస్తామని ప్రకటించింది. వాస్తవానికి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో మహిళా బిల్లు అమలు కూడా ఒక అంశం. కానీ, ఆర్జేడీ తదితర భాగస్వామ్య పక్షాల వ్యతిరేకతతో అమలు సాధ్యం కాలేదు. 2008లో ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో గందరగోళం నెలకొంది. దీంతో బిల్లును పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేశారు. ఇంకా జాప్యం చేయకుండా అమలు చేయాలని ఆ కమిటీ సూచించింది. బిల్లును తాము వ్యతిరేకించబోమని ఆర్జేడీ ప్రకటించటంతో.. బీజేపీ, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో 2010లో బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. కానీ, లోక్‌సభలో మాత్రం ఆమోదముద్ర పడలేదు. దీంతో అనంతరకాలంలో మహిళాబిల్లు వీగిపోక తప్పలేదు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 07:57 AM