Share News

అమెరికా ఒత్తిడికి కేంద్రం లొంగిపోయింది: ఖర్గే

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:41 PM

అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో విమర్శించారు. భారతీయ వస్తువులపై 100 శాతం టారిఫ్ విధించాలనుకుంటున్న అమెరికా ఒత్తిడిని అడ్డుకోవడంలో దేశ విదేశాంగ, వాణిజ్య విధానాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా ఒత్తిడికి కేంద్రం లొంగిపోయింది: ఖర్గే

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో విమర్శించారు. భారతీయ వస్తువులపై 100 శాతం టారిఫ్ విధించాలనుకుంటున్న అమెరికా ఒత్తిడిని అడ్డుకోవడంలో దేశ విదేశాంగ, వాణిజ్య విధానాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా 100 శాతం సుంకాల విధానం అమల్లోకి వస్తే, భారత్‌కు తీవ్రంగా నష్టం తప్పదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధాలు, వస్త్రాలు, ఇంజినీరింగ్ గూడ్స్, రసాయనాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, నగలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆ సుంకాల ప్రభావం తీవ్రంగా పడవచ్చన్నారు. మొదట 25%, తర్వాత 50%, ఇప్పుడు 100% సుంకాల హెచ్చరిక వచ్చిందన్నారు.


మన రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు

దేశ వ్యవసాయ రంగంలో అమెరికాను ఆహ్వానించే ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్‌‌కు మోదీ ప్రభుత్వం ఒప్పుకుందని, దీంతో మన దేశ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశ వ్యవసాయ రంగంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఆధిపత్యం చెలాయించే పరిస్థితి తెచ్చారన్నారు. ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.48 లక్షల కోట్లు) విలువైన అమెరికా వస్తువులు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ఇక యూపీఐ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయం కూడా ప్రభుత్వ లొంగుబాటుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. సుంకాలు, వాణిజ్యం, హెచ్1బీ వీసాలు, డిజిటల్ చెల్లింపుల్లో అమెరికా ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోందని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘టారిఫ్‌లు, వాణిజ్యం, హెచ్1బీ ఇమిగ్రేష్, వీసాలు, డిజిటల్ పేమెంట్లు ఇలా అన్ని విషయాల్లో భారత్‌పై అమెరికా ఒత్తిడి బాగా పెరిగింది. దేశాన్ని అబ్ కీ బార్ ట్రంప్ సర్కారు నియంత్రిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల 140 కోట్ల మంది భారతీయులు బాధపడాల్సి వస్తోంది. హౌడీ మోదీజీ..! మీరు ఇలా లొంగిపోతూనే ఉండండి’ అని ఖర్గే విమర్శించారు.


Also Read:

యాడైతేనేం.. దుడ్లొస్తే చాలు!

35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్

62 గంటలు సముద్రంలోనే.. మృత్యుంజయుడు ఈ బాలుడు..

Updated Date - Sep 16 , 2026 | 01:41 PM