Share News

మహిళ కడుపులో కత్తెర మరిచిన వైద్యులు.. ఐదేళ్ల తర్వాత.?

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:21 PM

వైద్యులు చేసిన ఓ పొరపాటు.. ఒక మహిళ జీవితాన్ని ఐదేళ్ల పాటు నరకప్రాయంగా మార్చింది. శస్త్రచికిత్స సమయంలో కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లువేసిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహిళ కడుపులో కత్తెర మరిచిన వైద్యులు.. ఐదేళ్ల తర్వాత.?
Kerala Medical Negligence

ఇంటర్నెట్ డెస్క్: కేరళ(Kerala)లో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ దాదాపు ఐదేళ్ల పాటు నరకం అనుభవించింది. ఈ దారుణ ఘటన ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలప్పుజ జిల్లా పున్నప్రా తీర ప్రాంతానికి చెందిన ఉష జోసెఫ్‌ కుట్టి(51) అనే మహిళకు ఐదేళ్ల క్రితం అలప్పుజ మెడికల్ కాలేజ్(Alappuja Medical College) వైద్యులు గర్భాశయ చికిత్స చేశారు. అప్పటి నుంచి ఆమె తరుచూ కడుపునొప్పి, యూరిన్‌లో రక్తం రావడం లాంటి సమస్యలతో నరకం అనుభవిస్తోంది. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఓ యూరాలజిస్ట్ సలహా మేరకు సిటి స్కాన్ చేయించుకున్నారామె. ఎక్స్-రే రిపోర్ట్ చూసిన డాక్టర్ షాక్‌కు గురయ్యాడు. గతంలో శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్యులు.. ఆమె కడుపులో పొరపాటున ఒక సర్జికల్ కత్తెరను మర్చిపోయినట్లు గుర్తించారు.


తన కడుపులో కత్తెర ఉన్న విషయం తెలిసిన తర్వాత మానసికంగా ఆందోళనకు గురయ్యారు జోసెఫ్ కుట్టి. సదరు ఎక్స్-రే రిపోర్టులను తీసుకుని అలప్పుజ మెడికల్ కాలేజ్ వైద్యుల వద్దకు వెళ్లారామె. వైద్యులు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని తమను బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పుతెచ్చిన ఆ ఆస్పత్రిలో మరోసారి ఆపరేషన్ చేయించుకోవాలంటే భయంగా ఉందని బాధితురాలు కన్నీరు పెట్టుకున్నారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘బాధితురాలికి చాలా అన్యాయం జరిగింది. ఆమె మానసికంగా, శారీరకంగా ఎంతో నరకం అనుభవించారు. ఆమె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు నేను భరిస్తాను’ అని అన్నారు. ఉషకు మెరుగైన చికిత్స కోసం కొచ్చిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ ఏడాది చివరి గ్రహణం.. ఎప్పుడంటే? .. ఆ రోజు ఇలా చేయండి..

మిగులు ప్లాట్లను మింగేస్తారా?

For More AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 08:14 AM