గల్ఫ్‌లో మలయాళీ నర్సుల కష్టాలు.. పీఎం సాయం కోరిన సీఎం
ABN , Publish Date - Jun 07 , 2026 | 04:16 PM
దుబాయ్‌లోని ఓ ఆసుపత్రి మూతపడటంతో వందలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో కేరళకు చెందిన నర్సులూ ఉండటంతో.. ఈ సమస్యను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లోని ఇరానియన్ ఆసుపత్రి మూతపడటంతో వందలాది మంది భారతీయ ఆరోగ్య సిబ్బంది, ముఖ్యంగా కేరళకు చెందిన నర్సులు ఉపాధి కోల్పోయి అనిశ్చితిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఆస్పత్రి కార్యకలాపాలు నిలిచిపోయాయని, దాంతో అక్కడ పనిచేస్తున్న నర్సులు, వైద్య సిబ్బంది ఉద్యోగాలను కోల్పోయారని తన లేఖలో పేర్కొన్నారు సతీశన్. ఉద్యోగ నష్టంతో పాటు వీసా సంబంధిత ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారని వివరించారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, సందర్శకుల వీసాల జారీపై ఆంక్షలు విధించడంతో ఎన్నో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని సీఎం తెలిపారు. కొందరు నర్సులు యూఏఈలో ఉండేందుకు అనుమతించే గడువు త్వరలోనే ముగుస్తుందని, దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
దుబాయ్‌లో ఏళ్ల తరబడి వైద్య సేవలందిస్తున్న ఈ నర్సులు కొవిడ్-19 సమయంలోనూ విశేష సేవలందించారని సీఎం గుర్తుచేశారు. స్థానిక చట్టాలను పాటిస్తూ ఆదర్శవంతంగా పనిచేసిన వీరు.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా.. వారి భవిష్యత్తు అవకాశాలపైనా ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. యూఏఈలో స్థిరపడిన అనేక కుటుంబాల్లో వారి పిల్లలు అక్కడే చదువుతున్నారని.. వారికి రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలూ ఉన్నాయని రాసుకొచ్చారు సతీశన్. ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి.. ఆ దేశ విదేశాంగ శాఖతో పాటు యూఏఈలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇది ఉపాధికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. ఎన్నో భారతీయ కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చీరల కింద దాక్కున్న టీఎంసీ కార్యకర్త!
భారత్‌లో పడిపోయిన జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
భారత్