పీఆర్‌సీపై కర్ణాటకలో పొలిటికల్ హీట్.. పాక్ జాతీయులు అరెస్ట్
ABN , Publish Date - Jul 12 , 2026 | 06:11 PM
రాష్ట్రంలో నివసిస్తున్న వారందరికీ శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు (పీఆర్‌సీ) జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిని ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో చిక్కబళ్లాపూర్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బెంగళూరు, జులై 12: తహసీల్దార్ల ద్వారా ప్రజలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు (పీఆర్‌సీ) జారీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే సమయంలో ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఇద్దరు పాకిస్థానీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు పాక్ జాతీయతను దాచి పెట్టి.. ఓటర్ ఐడీతోపాటు రేషన్ కార్డు పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయంపై కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ క్రమంలో ఈ అంశంపై హోం శాఖ మంత్రి అమిత్ షాకు మరో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం కారణంగా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు అధికారిక పత్రాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది జాతీయ భద్రతను పెనుముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే బీజేపీ ఆందోళనను కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఖండించారు. పత్రాలన్నీ సరిగ్గా ధ్రువీకరించిన తర్వాతే పీఆర్‌సీ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా అక్రమ వలసదారులను గుర్తించడానికి ఇది సహాయ పడుతుందని పేర్కొన్నారు. ఈ పీఆర్‌సీ రాష్ట్రంలో నివసిస్తున్న వారికి.. నివాస హోదా, రేషన్ కార్డు, విద్య, ఉపాధితోపాటు ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే పత్రం అని అభివర్ణించారు. ఇక పీఆర్‌సీ అనేది కేవలం నివాస పత్రం మాత్రమేనని.. దీనికి పౌరసత్వంతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. పౌరసత్వం అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం అని ఆయన గుర్తు చేశారు.
పాకిస్థానీ జాతీయులు ఫరా నాజ్‌తోపాటు ఆమె కుమారుడు మహమ్మద్ ఫర్దీన్‌లను చిక్కబళ్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు ఓటర్ ఐడీతోపాటు రేషన్ కార్డు పొందారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపి వారు పొందిన కార్డులను రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జిమ్‌లో నీళ్లు.. ఆగని వర్కవుట్లు.. వీడియో వైరల్
టీ స్టాల్‌లో షాకింగ్ దృశ్యం.. వీడియో వైరల్!
For More National News And Telugu News