విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేల జీతం.. కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలికి నోటీసు
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:52 PM
కర్ణాటక ఎమ్మెల్యే ఉమేశ్ మేటి మేనకోడలు తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఓ క్లినిక్‌లో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఆమె.. కొన్ని నెలలుగా విధులకు హాజరు కాకుండా జీతం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని బాగల్‌కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. బాగల్‌కోట్‌లోని నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిగా ఉన్న ఆమె.. విధులకు హాజరుకాకుండా నెలకు రూ. 70 వేల జీతం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక ఆమె జీతం తీసుకుంటూ ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై బాగల్‌కోట్ జిల్లా పంచాయతీ సీఈఓ విచారణకు పిలిచినా డాక్టర్ అంకిత హాజరు కాలేదు. దీంతో ఆమెకు సీఈఓ నోటీసు పంపించారు. సెప్టెంబరు 18న విచారణకు ఎట్టిపరిస్థితుల్లో రావాలని స్పష్టం చేశారు.
ఆ నోటీసు ప్రకారం డాక్టర్ అంకిత గత మార్చి నుంచి నేటి వరకు (సెప్టెంబరు 16) ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాలేదు. క్లినిక్‌లో వైద్యాధికారి లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులకు గురయ్యారు. అంకిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని నోటీసులో పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఆమె తీసుకున్న జీతాన్ని రికవరీ చేస్తామని సీఈఓ తెలిపారు. అలాగే ఈ సారి కూడా విచారణకు హాజరు కాకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. కాగా జిల్లా ఆరోగ్య అధికారి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
రాపిడో నిర్వాహకులకు రూ. పది లక్షల జరిమానా.. ప్రేరేపించే సందేశాలు నిలిపివేయాలని ఆదేశం
నాలుగేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష..