Karnataka Survey On EVMs: నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:57 PM
సర్వేలో భాగంగా 1023 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది.
బెంగళూరు: ఈవీఎంల పనితీరు, ఓట్ చోరీపై పదేపదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కర్ణాటకలో మెజారిటీ ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (EVMs) విశ్వసిస్తున్నట్టు ఒక సర్వేలో తేలింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ అయిన కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ (కేఎంఈఏ) గత ఏడాది ఒక సర్వే నిర్వహించింది. సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది.
సర్వేలో భాగంగా 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది. ఈవీఎలంను విశ్వసిస్తున్నట్టు 83.61 శాతం మంది వెల్లడించారు. ఈవీఎంలు కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అంగీకరించారు.
సర్వే ఫలితాలపై బీజేపీ
కర్ణాటక ప్రభుత్వ సర్వే ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తరచు ఈవీఎంల గురించి, ఈసీఐ గురించి అబద్ధాలు చెబుతుంటారని, కానీ ఆయన మాట తప్పని కర్ణాటకలో సొంత ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే తేల్చిచెప్పిందని అన్నారు. ఈవీఎంలను కర్ణాటక ఓటర్లు విశ్వసించారని, ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతంగా జరుగుతాయని స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. కాగా, ఈ సర్వే కాంగ్రెస్‌కు చెంపపెట్టని, ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా కాంగ్రెస్ అభద్రతను చాటుకుంటోందని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్.అశోక అన్నారు. గెలిచినప్పుడు విజయాలను ఆస్వాధిస్తూ, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపడుతుందని, వారిది సైద్ధాంతిక రాజకీయాలు కావని, వెసులుబాటు రాజకీయాలని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
నూతన సంవత్సరంలో పట్టుదలతో ముందుకు సాగాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్ధి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి