Indore Water Contamination: ఇండోర్‌లో దారుణం.. తాగు నీరు కలుషితం కావడంతో 10 మంది మృతి
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:59 PM
ఇండోర్‌లో నీటి కాలుష్యానికి ఏకంగా 10 మంది బలి కావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మంచి నీటి పైప్‌లైన్‌లోకి మురుగు నీరు చేరడంతో ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే పైప్‌లైన్‌ను రిపేర్ చేశామని, కొన్ని రోజులు పాటు నల్లా నీటిని తాగొద్దని స్థానికులకు సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కలుషిత నీరు బారిన పడి 10 మంది మృతి చెందారు. మరో 149 మంది అనారోగ్యం పాలయ్యారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందిన ఇండోర్‌లో ఈ ఘటన ప్రస్తుతం పెను కలకలం రేపుతోంది (Indore Water Contamination).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, భాగీరథ్‌పురా ప్రాంతంలోని మంచి నీటిపైప్‌లైన్‌లోకి మురుగు నీరు వచ్చి చేరడంతో స్థానికులు అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్, తీవ్ర జ్వరాల బారినపడ్డారు. భారీ సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరారు. 150 మందికి పైగా జనాలు ఆసుపత్రి పాలు కావడంతో సమస్య ప్రజారోగ్య సంక్షోభ స్థాయికి చేరింది. టాయిలెట్ పక్కన ఉన్న పైప్‌లైన్‌లోకి మురుగు నీరు లీక్ కావడంతో ఈ ఘటన జరిగినట్టు మున్సిపల్ అధికారులు గుర్తించారు.
గతేడాది డిసెంబర్ 25నే స్థానికులు నీరు కలుషితమైన వైనాన్ని గుర్తించారు. నీరు దుర్వాస, రంగు మారడంతో ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రత్యామ్నాయం లేక అదే నీరు తాగిన కొందరు ఆ తరువాత కొన్ని రోజులకే అనారోగ్యం పాలయ్యారు. డయేరియా, డీహైడ్రేషన్, జ్వరంబారిన పడ్డారు. ఈ క్రమంలో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కలుషిత నీరు తాగి ముగ్గురు మరణించినట్టు డిసెంబర్ 29న మేయర్ పుష్యమిత్ర భార్గవ ప్రకటించారు. అప్పటికే ఆసుపత్రుల్లో సుమారు 100 మంది చేరగా దాదాపు 1100 మంది స్థానికులు తాము అనారోగ్యానికి గురయినట్టు తెలిపారు. కలుషిత నీరు కలిపిన పాలు తాగి ఐదున్నర నెలల చిన్నారి కూడా మరణించడం మరింత కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో జోనల్ ఆఫీసర్‌తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. పర్యవేక్షణ లోపాల కారణంగా ఇన్‌ఛార్జ్ సబ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఇక మున్సిపల్ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్టు టెస్టుల్లో కూడా తేలింది. అయితే, ప్రభావిత పైప్‌లైన్‌ను రిపేర్ చేసి, శుభ్రపరిచామని అధికారులు తెలిపారు. తదుపరి సమాచారం ఇచ్చే వరకూ నల్లా నీరు తాగొద్దని ఆ ప్రాంతంలోని వారికి సూచించారు.
ఇవీ చదవండి:
నూతన సంవత్సరంలో పట్టుదలతో ముందుకు సాగాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
బలహీనంగా ఉన్నా.. అన్నాడీఎంకేనే మా ప్రత్యర్థి