Share News

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:35 PM

కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలపడంతో 20 మంది నూతన నాయకులను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
Karnataka Cabinet Expansion

బెంగళూరు, ఆగస్టు 3: కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలపడంతో 20 మంది నూతన నాయకులను కేబినెట్‌లోకి తీసుకున్నారు. సామాజిక సమతుల్యత, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, వొక్కలిగ, మైనారిటీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో ఈ సాయంత్రం నూతన మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

karnataka cabinet  expansion.jpg


కేబినెట్‌లో కులాల వారీ ప్రాతినిధ్యం

దళిత వర్గాలకు రికార్డు ప్రాతినిధ్యం (SC/ST): రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా 7 మంది ఎస్సీ (SC) నేతలకు కేబినెట్‌లో చోటు దక్కింది. వీరిలో ఎస్సీ-రైట్ నుంచి ముగ్గురు, ఎస్సీ-లెఫ్ట్ నుంచి ఇద్దరు, లంబానీ, భోవి వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు ఎస్టీ (ST) వర్గానికి చెందిన నేతలకు స్థానం లభించింది.

లింగాయత్ & వొక్కలిగ: లింగాయత్ సామాజిక వర్గం నుంచి 7 మంది, వొక్కలిగ సామాజిక వర్గం నుంచి 5 మంది మంత్రులు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

మైనారిటీలకు ప్రాధాన్యం: ముస్లిం సమాజానికి చెందిన నలుగురికి కీలక పదవులు లభించాయి. ముగ్గురు కేబినెట్ మంత్రులుగా ఎంపికవ్వగా, మరొకరు శాసనమండలి చైర్మన్‌గా నియమితులయ్యారు.

బీసీ వర్గాలు (OBC): ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నుంచి 5 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.


నూతన మంత్రుల జాబితా

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించిన జాబితా ప్రకారం: పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లామణి, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టి. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాల్ వైద్య, అజయ్ సింగ్, ఎన్. చెలువరాయ స్వామి, కె.ఎమ్. శివలింగే గౌడ, హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతెగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద్ కాశప్పనవర్, మరియు లక్ష్మణ్ సవది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నేతగా గాయత్రి శాంతెగౌడ నిలిచారు.


అసెంబ్లీ, మండలి కీలక పదవులు

స్పీకర్ (అసెంబ్లీ): జి. ఎస్. పాటిల్ (రెడ్డి సామాజిక వర్గం)

డిప్యూటీ స్పీకర్ (అసెంబ్లీ): ఎ. ఎస్. పొన్నన్న

చైర్మన్ (శాసనమండలి): సలీమ్ అహ్మద్

డిప్యూటీ చైర్‌పర్సన్ (శాసనమండలి): ఉమాశ్రీ

సీనియర్లకు నిరాశ

కొత్త కేబినెట్ కలయికలో సీనియర్ నాయకులు హెచ్.కె. పాటిల్, దినేష్ గుండూరావు, లక్ష్మీ హెబ్బాళ్కర్, ఆర్‌.వి. దేశ్‌పాండే, హెచ్.సి. మహాదేవప్ప వంటి పలువురు ప్రముఖులకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, మంత్రివర్గంలో అవకాశం రాని సీనియర్ నాయకులకు పార్టీ, ప్రభుత్వాల్లో తగిన ఇతర బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది.


వార్తలు కూడా చదవండి...

కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 05:43 PM