Share News

76 వేల కేసులు.. 52 వేల కోట్ల పరిహారం!

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:48 AM

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాడకం వల్ల అండాశయ క్యాన్సర్లు వస్తున్నాయంటూ అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాఖలైన వేలాది కేసులను సెటిల్‌ చేసుకునేందుకు ఆ సంస్థ సిద్ధమైంది.

76 వేల కేసులు.. 52 వేల కోట్ల పరిహారం!

  • చెల్లించడానికి సిద్ధమైన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

  • దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న వేలాది కేసులను ఒకేసారి పరిష్కరించేందుకు సంస్థ ప్రతిపాదన

  • బాధితుల్లో 95 శాతం మంది అంగీకరిస్తేనే ఈ డీల్‌ ముందుకు.. లేదా కేసులు యథాతథం

  • పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలపై చెల్లించడానికి సిద్ధమైన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

న్యూఢిల్లీ, జూలై 28: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ పౌడర్‌ వాడకం వల్ల అండాశయ క్యాన్సర్లు వస్తున్నాయంటూ అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాఖలైన వేలాది కేసులను సెటిల్‌ చేసుకునేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఆ కేసుల పరిష్కారానికి 5.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.52,660 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. అయితే, డబ్బులిచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమైనా.. కేసులు వేసినవారిలో కనీసం 95ు మంది ఆ సొమ్మును తీసుకునేందుకు ఆమోదం తెలపాలి. లేదంటే ఇన్నేళ్లుగా కోర్టుల్లో దీనిపై జరుగుతున్న న్యాయపోరాటం యథాతథంగా కొనసాగుతుంది. కోర్టుల్లో కేసులు వేసినవారు ఒప్పుకొంటే 3 బిలియన్‌ డాలర్లు 2027 నాటికి.. మిగతా సొమ్ము 2028 నాటికి చెల్లించాలని ఆ సంస్థ భావిస్తోంది.


1997లో డార్లీన్‌ కోకర్‌ అనే మహిళ తొలిసారిగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌పై కేసు వేశారు. ఆ సంస్థ తయారుచేసిన టాల్కమ్‌ పౌడర్‌ వాడడం వల్ల తనకు మెసోథెలియోమో అనే క్యాన్సర్‌ వచ్చిందని ఆమె కోర్టును ఆశ్రయించారు. దరిమిలా.. ఆ సంస్థ ‘టాల్క్‌’తో తయారుచేసే బేబీపౌడర్లు, ఇతర ఉత్పత్తుల్లో ఉండే ‘ఆస్బెస్టాస్‌’ కారణంగా క్యాన్సర్‌ బారిన పడ్డామంటూ వేలాది మంది అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కోర్టులను ఆశ్రయించారు. వాటిల్లో చాలా కేసుల్లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ గెలిచింది కూడా. అయినా.. ఇంకా 76 వేల కేసులు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో, వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి.


ఈ కేసుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఆ సంస్థ మూడుసార్లు దివాలా పిటిషన్లు సైతం వేసింది. కానీ.. మూడుసార్లూ కోర్టులు ఆ పిటిషన్లను కొట్టేశాయి లేదా తిరస్కరించాయి. దీంతో.. భారీగా పరిహారం చెల్లించి అయినా సరే ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇలా 5.5 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఇలా చెల్లించడం అంటే తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని తాము ఒప్పుకొన్నట్టు కాదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఎరిక్‌హాస్‌ తెలిపారు. తమ ఉత్పత్తులు అత్యంత సురక్షితమైనవన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 08:19 AM