12 ఏళ్లలో 50 కోట్ల భారతీయులకు పేదరికం నుంచి విముక్తి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:34 PM
భారత మండపం వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వందేళ్ల వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన ప్రసంగించారు.
ఇంటర్నెట్ డెస్క్: గడిచిన 12 సంవత్సరాల్లో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక తాజా గణాంకాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత మండపం వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వందేళ్ల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రసంగించారు. పలు విషయాలను ఆయన వెల్లడించారు. 12 ఏళ్లుగా భారత్ ఆర్థిక అభివృద్ధిలో పరుగులు పెడుతోందని చెప్పారు. గతంలో ఫ్రాగిల్ ఫైవ్ (బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలు)లో ఉన్న దేశం ఇప్పుడు పురోగతి సాధిస్తోందని అన్నారు.
‘వందేళ్లుగా భారత్ ఎకానమీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. లైసెన్స్ కోటా రాజ్, విఫలమైన జాతీయీకరణ.. ఇలా అనేక దశలను ఆర్థిక వ్యవస్థ దాటింది. 21వ శతాబ్దిలో ఫ్రాగిల్ ఫైవ్ జాబితాలోనూ ఉంది. అయితే ఈ వ్యవస్థ బలోపేతానికి దేశ యువత, రైతులు, శ్రామికులు అందరూ కృషి చేశారు. పారిశ్రామిక వేత్తలూ ఇందుకోసం శ్రమించారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఫిక్కీ శతాబ్ది వేడుకలు
వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఫిక్కీ వందేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా భారత మండపంలో శతాబ్ది వేడుకలను నిర్వహించారు. ఇన్ని సంవత్సరాలూ ఫిక్కీ చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు. దశాబ్దాలుగా మారుతున్న కాలానికి అనుగుణంగా సర్దుకుపోతూ, భారతదేశ ఆర్థిక ప్రయాణానికి ఆ సంస్థ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. కాగా ఫిక్కీ 1927లో ప్రారంభమైంది.
ఈ వార్తలూ చదవండి
పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. శిథిలాల్లో చిక్కుకున్న భారీ ట్రక్కులు
అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోలో విషాదం.. బుల్డోజర్ ఢీకొని బీజేపీ నేత కుమారుడి మృతి