Share News

పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. శిథిలాల్లో చిక్కుకున్న భారీ ట్రక్కులు

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:21 AM

పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భాక్రా కాలువపై నిర్మించిన ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.

పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. శిథిలాల్లో చిక్కుకున్న భారీ ట్రక్కులు
Bhakra Bridge Collapse

పటియాలా, నవంబర్ 19: పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భాక్రా కాలువపై నిర్మించిన ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సందర్భంగా వంతెనపై ప్రయాణిస్తున్న రెండు భారీ ట్రక్కులు శిథిలాల్లో చిక్కుకుపోయాయి. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున పటియాలా-సంగ్రూర్-బఠిండా జాతీయ రహదారి పసియానా వద్ద జరిగింది.


ఈ ప్రమాదంలో ఓ ట్రక్కులో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. రెండు ట్రక్కుల డ్రైవర్లను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


రెండు ట్రక్కులు ఇసుకను తరలిస్తున్నాయని, అధిక బరువు కారణంగానే వంతెన కూలిపోయి ఉండవచ్చని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం సాంకేతిక నిపుణుల పరిశీలన తర్వాతే వెల్లడికానుంది. ఈ వంతెనను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో 2016లో నిర్మించారు. కేవలం 10 సంవత్సరాలకే కూలిపోవడంతో నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తోసుకుంటూ యువకుడి పరుగు..

అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోలో విషాదం.. బుల్డోజర్ ఢీకొని బీజేపీ నేత కుమారుడి మృతి

Updated Date - Nov 19 , 2026 | 11:28 AM