ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. 'ఇండియా-ఆఫ్రికా సమ్మిట్' వాయిదా.. భారత్‌లో హై-అలర్ట్!
ABN , Publish Date - May 21 , 2026 | 04:55 PM
దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 21: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన నాల్గవ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్' (IAFS-IV) వాయిదా పడింది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్న ఎబోలా (Ebola) వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వం ఇవాళ (గురువారం) అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
సదస్సు వాయిదా.. కొత్త తేదీలు త్వరలోనే
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం 4వ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ మే 28 నుంచి మే 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సి ఉంది. అయితే, ఆఫ్రికాలో మారుతున్న ప్రజారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్, భారత ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని సదస్సును వాయిదా వేయాలని నిర్ణయించాయి. ఈ సదస్సుకు సంబంధించిన కొత్త తేదీలను, ఇతర అనుబంధ సమావేశాల షెడ్యూల్‌ను ఇరుపక్షాలు త్వరలోనే సంప్రదింపుల ద్వారా ఖరారు చేయనున్నాయి.
ఆఫ్రికాకు భారత్ పూర్తి మద్దతు
ఈ క్లిష్ట సమయంలో ఆఫ్రికా దేశాలకు భారత్ తన పూర్తి సంఘీభావాన్ని తెలియజేసిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది. 'ఆఫ్రికా సీడీసీ' (Africa CDC) నేతృత్వంలో జరుగుతున్న ప్రజారోగ్య సన్నద్ధత, అత్యవసర పరిస్థితుల నియంత్రణ ప్రయత్నాలకు భారత్ తన వంతు సాంకేతిక, వైద్య సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ
ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (DGHS) అంతర్జాతీయ ప్రయాణికులకు కీలకమైన హెల్త్ అడ్వైజరీ (మార్గదర్శకాలు) జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారు లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణించి (Transit) భారత్‌కు వచ్చే వారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే తమ ఆరోగ్య పరిస్థితిని అధికారులకు నివేదించాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 'హై-రిస్క్'గా వర్గీకరించిన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా, సౌత్ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఎబోలా లక్షణాలు ఉన్నా లేదా బాధితులతో పరిచయం ఉన్నా ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు తెలపాల్సి ఉంటుంది.
ఆందోళన వద్దు.. భారత్ సంపూర్ణ సన్నద్ధం
ప్రస్తుతానికి భారతదేశంలో ఎక్కడా ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. డబ్ల్యూహెచ్‌ఓ (WHO) సూచనల ప్రకారం ప్రభుత్వం అన్ని ముందస్తు నివారణ చర్యలను తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎబోలా నివారణకు అవసరమైన సన్నద్ధతతో ఉండాలని కేంద్రం ఆదేశించింది. 'ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి' అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇక, భారత్, ఆఫ్రికా దేశాల మధ్య దౌత్య, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ కీలక సదస్సు, అక్కడి ఆరోగ్య సంక్షోభం అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి నిర్వహించబడుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News