దేశం వదిలివెళ్లాలన్న నోటీసుపై బాంబే హైకోర్టుకు ఇమ్రాన్
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:21 PM
దేశం వదిలివెళ్లాలని తనకు జారీ చేసిన నోటీసును నటుడు, ఆమిర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్.. బాంబే హైకోర్టులో సవాలు చేయనున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, సీజేపీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశం వదిలివెళ్లాలని తనకు జారీ చేసిన నోటీసును నటుడు, ఆమిర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్.. బాంబే హైకోర్టులో సవాలు చేయనున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అవకతవకల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, సీజేపీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఇమ్రాన్ పాల్గొన్నారు. ముంబైలోని క్రాంతి మైదాన్లో జరిగిన ప్రదర్శనకు ఆయన సంఘీభావం తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఈనెల 28 లోపు దేశం విడిచివెళ్లాలని అధికారులు ఆయనకు నోటీసు పంపారు. ఖాన్ అమెరికా జాతీయుడని, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉన్నవారు దేశంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలో పాల్గొనరాదని, ఆ నిబంధనలను ఇమ్రాన్ ఉల్లంఘించినందున దేశం విడిచివెళ్లాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఆ నోటీసుపై ఇమ్రాన్ ఖాన్ తరపున ఆయన అడ్వొకేట్ జుల్ఫికర్ మెమన్ శుక్రవారం లేదా సోమవారం (ఈనెల 19) బాంబే హైకోర్టులో సవాలు చేయనున్నారు. ఓసీఐ కార్డు ఉన్నంతమాత్రాన దేశంలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదనే నియమం ఏమీ లేదని మెమన్ అన్నారు. ఈనెల 28 లోపు దేశం వీడివెళ్లాలని తన క్లైంట్ ఇమ్రాన్కు ముంబై పోలీసులు జారీ చేసిన నోటీసు తీవ్రమైనదని ఆయన చెప్పారు. ఆ పిటిషన్ దాఖలైతే చీఫ్ జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నా విచారణ జరుపుతారు.
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు