న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు: సీజేఐ సూర్యకాంత్
ABN , Publish Date - Oct 15 , 2026 | 02:02 PM
న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నాయకులు సుప్రీంకోర్టు వరకు చేపట్టిన నిరసన ప్రదర్శనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 15: న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నాయకులు సుప్రీంకోర్టు వరకు చేపట్టిన నిరసన ప్రదర్శనపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరని తేల్చిచెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీతోపాటు ఇండియా కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులు జారీ చేసినంత మాత్రాన రాజకీయ నాయకుల ప్రవర్తనను సమర్థించినట్లు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయస్థానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సరికాదు..
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది గౌరవ్ భాటియా సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ అని వ్యాఖ్యానించారు. నిరసన ప్రదర్శన ద్వారా న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారన్న వాదనపై స్పందిస్తూ.. అవన్నీ బలహీనమైన ప్రయత్నాలేనని పేర్కొన్నారు. బయట రాజకీయ నాయకులు చేసే ప్రకటనలను తాము గమనిస్తూనే ఉన్నామని, సమాజంలో జరుగుతున్న పరిణామాలు తెలియకుండా తాము లేమని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ, అఖిలేశ్కు నోటీసులు..
సుప్రీంకోర్టు వరకు నిరసన ప్రదర్శన చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్పై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తోపాటు ఇతర నేతలకు నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 12న ఇండియా కూటమి చేపట్టిన నిరసన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో రికార్డైన సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ఆదేశించింది. కాగా, సోమవారం నాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నాయకులు ఢిల్లీలోని బారాఖంబా రోడ్ నుంచి సుప్రీంకోర్టు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారీగా జనం గుమిగూడారు.
ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఇండియా కూటమి పిటిషన్..
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ నేత డి.రాజా, జేఎంఎం నేత మహువా మాఝీ, సీపీఎం నేత ఎం.ఏ.బేబీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఈటీ మహమ్మద్ బషీర్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఎస్ఐఆర్ నిర్ణయాల రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తమ అభ్యంతరాలను పరిష్కరించడంతోపాటు స్వతంత్ర కమిటీతో ఆడిట్ నిర్వహించాలని కోరారు. మొత్తం పది ప్రధాన డిమాండ్లను పిటిషన్లో ప్రస్తావించారు.
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు