సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:29 PM
ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన యువతి అంకిత భండారీకి న్యాయ కోసం నిరసన దీక్ష చేపట్టిన ఆమె తల్లిదండ్రులను గురువారం పోలీసులు విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన యువతి అంకిత భండారీకి న్యాయ కోసం నిరసన దీక్ష చేపట్టిన ఆమె తల్లిదండ్రులను గురువారం పోలీసులు విడుదల చేశారు. ఇండియా గేట్ వద్ద వారు బుధవారం నిరసనకు దిగారు. 2022లో 19 ఏళ్ల అంకిత భండారీ హత్యకు గురైంది. ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్టుగా చేసిన ఆమెను హత్య చేశారు. ఆరు రోజుల తరువాత స్థానికంగా ఉన్న ఓ నాలాలో ఆమె మృతదేహం లభించింది.
ఈ కేసుతో బీజేపీ నేత, సిక్కిం గవర్నర్‌గా నియమితులైన దుష్యంత్ కుమార్ గౌతమ్‌కు కూడా సంబంధం ఉందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆయన పాత్ర ఏంటో తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే గౌతమ్‌ను నియమించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో అంకిత భండారీ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తరువాత రెండు గంటలకు విడిచిపెట్టారు.
బుధవారం నిరసనకు దిగిన అంకిత తండ్రి విరేంద్ర భండానీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ కూతురి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకూ గవర్నర్‌గా గౌతమ్ నియామకాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్‌కు కేంద్రం ఒప్పుకోకపోతే దేశవ్యాప్త నిరసనలు ప్రారంభం అవుతాయని అన్నారు. నిరసన చేపట్టిన అంకిత తల్లిదండ్రులకు కాంగ్రెస్ నేతలు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. గవర్నర్ నియామకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హీ వంటి నేతలు కూడా వారికి అండగా నిలిచారు.
ఈ వార్తలనూ చదవండి:
జంతర్ మంతర్‌లో నిరసనల కొనసాగింపుపై పిటిషన్.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు