ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేతపై సుప్రీంకోర్టుకు కేంద్రం క్షమాపణలు..
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:45 PM
దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ క్షమాపణలు చెప్పారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పరిమిత ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు వివరించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 10న ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ క్షమాపణలు చెప్పారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పరిమిత ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెబుతూ బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు.
కాగా, ఇంటర్నెట్ నిలిపివేతపై అక్టోబర్ 11న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో తమ గత ఆదేశాలను ఉల్లంఘించారంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హోంశాఖ కార్యదర్శి తన వివరణను నాలుగు పేజీల అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ సేవల నిలిపివేత మొబైల్ సెల్యులార్ డేటాకే పరిమితమైందని, వై-ఫై, బ్రాడ్బ్యాండ్ వంటి నాన్-సెల్యులార్ ఇంటర్నెట్ సేవలను, టెలికమ్యూనికేషన్ సేవలను నిలిపివేయలేదని ఆయన తెలిపారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో భద్రతా నిబంధనలకు లోబడి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసేందుకు అనుమతించేలా అక్టోబర్ 11న ఇచ్చిన ఆదేశాలను అవసరమైన మేరకు సవరించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కాగా, కేంద్రం సమర్పించిన వివరణపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ నిలిపివేతకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు వెలువడతాయి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
రాజస్థాన్లో పాక్ డ్రోన్ ఆయుధాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్..
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మత మార్పిడితో రిజర్వేషన్ వర్తించదని స్పష్టం