Share News

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:02 PM

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌
IAF espionage case

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేన(Air Force)లో ఓ ఉద్యోగిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ కేసు దర్యాప్తులో తీగ లాగితే.. ఈ లీకుల డొంక కదిలింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన జబరారామ్‌ అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలతో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే సుమిత్ కుమార్‌(Sumit Kumar)తో సంబంధాలున్నట్లు తెలిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 36 ఏళ్ల సుమిత్‌.. అస్సాంలోని చబువా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో మల్టీటాస్కింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. తన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్‌కు అందించినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బు కోసం అతడే ఈ సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ హ్యాండ్లర్లకు షేర్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు.


2023 నుంచి పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. వారి నుంచి డబ్బు తీసుకుని.. యుద్ధ విమానాలు, క్షిపణుల వ్యవస్థ, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్టు తేలింది. నిందితుడిపై అధికార రహస్యాల చట్టం-1923, బీఎన్ఎస్-2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సుమిత్‌ను అరెస్ట్‌ చేసేందుకు రాజస్థాన్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించాయి.


ఇవి కూడా చదవండి:

ప్రియుడితో కలిసి అత్తను దారుణంగా చంపిన కోడలు

ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్‌ ఈథర్‌

Updated Date - Mar 23 , 2026 | 03:20 PM