Share News

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:41 PM

ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా 13 కోట్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, వారిలో నిజంగా అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బ్లాగ్‌లో ఆ వివరాలను ప్రచురించారు.

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

ఇంటర్‌నెట్ డెస్క్: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా 13 కోట్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, వారిలో నిజంగా అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బ్లాగ్‌లో ఆ వివరాలను ప్రచురించారు. సర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో 70 లక్షల మంది అర్హులైన ఓటర్లను మాత్రమే వివరణ లేకుండా తొలగించి ఉండవచ్చని అన్నారు.

‘సర్ ముగిసిన రాష్ట్రాల్లో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవి ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ డిలీషన్లలోనే ఉన్నాయి. అంటే ఆ ఓటర్ల పేర్లను రికార్డుల నుంచి తొలగించాలా వద్దా అన్న ప్రతిపాదన ఉంది. వాటిలో మరణాలు, రీలొకేషన్లు, డూప్లికేషన్ వంటి చట్టబద్ధమైన కారణాలు ఉన్నాయి. అలాగే తుది ఓటరు జాబితాలు ఇంకా పబ్లిష్ కాని రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయి. జనాభా, అధికారిక జనన మరణాల డేటా, సర్‌కు ముందు జరిగిన రిజిస్ట్రేషన్లు వంటి వివరాల ఆధారంగా 70 లక్షల మంది ఓటర్లను వివరణ లేకుండా తొలగించి ఉండవచ్చు. వివరణ లేకుండా అంటే 70 లక్షల మందిలో ప్రతి ఒక్కరినీ తప్పుగా తొలగించారని కాదు’ అని భల్లా పేర్కొన్నారు.


కాగా.. సర్ మూడు దశల ద్వారా ఓటరు జాబితాల నుంచి 13.37 కోట్ల పేర్లను తొలగించామని ఎన్నికల సంఘం గతంలో ప్రకటించింది. వాటిలో రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 7.22 కోట్ల పేర్లను తొలగించగా.. మూడో దశలో 17 రాష్ట్రాల్లో 6.15 కోట్ల ఓట్లను తొలగించారు. ఓటర్ల క్లెయిమ్స్, అభ్యర్థనలను రికార్డు చేసే ముందు ఆ తొలగింపులను రికార్డు చేశారని భల్లా పేర్కొన్నారు. ఇక రాయిటర్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. వాటిలో 2.8 కోట్ల మంది చనిపోయిన ఓటర్లు, 6.3 కోట్ల మంది రీలొకేట్ అయిన ఓటర్లు, ఒక కోటి డూప్లికేట్ ఎంట్రీలు ఉండగా.. మూడు కోట్ల మందిని ట్రేస్ చేయలేదు. ఈ కేటగిరి వర్గం ఓటర్లను తప్పుగా ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు భావించకూడదని భల్లా అన్నారు. ఓటరు జాబితాలో ఉండకూడని వ్యక్తులను తొలగించిన తర్వాత అర్హులైన ఓటర్లలో ఇంకా ఎంతమంది జాబితాలో చేరకుండా మిగిలిపోయారన్నదే అసలు ప్రశ్న అని ఆయన అంటున్నారు.


ఓటర్ల జాబితాలో లోటును ఎలా లెక్కించారంటే..

భల్లా అంచనా ప్రకారం.. 2026 జూన్ నాటికి భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వయోజనుల సంఖ్య 100.8 కోట్లుగా ఉంది. అయితే, ప్రతి వయోజనుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఓటరు నమోదు స్వచ్ఛందం కావడంతో కొందరు తమ పేర్లను నమోదు చేసుకోరని భల్లా చెప్పారు. సర్‌కు ముందు 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న వయోజనుల్లో 7.5 శాతం మంది ఓటర్లుగా నమోదు కాలేదని భల్లా అంచనా వేశారు. అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో ఒక్క శాతం మంది ఓటరుగా నమోదు కాలేదని ఆయన అంచనా. దీంతో మొత్తం వయోజనుల్లో సుమారు 8.5 శాతం మంది ఓటర్లుగా నమోదు కాలేదని లెక్కించారు. 100.8 కోట్ల వయోజనుల్లో 8.5 శాతం మందిని మినహాయిస్తే, ఓటర్ల జాబితాలో ఉండాల్సిన పేర్ల సంఖ్య సుమారు 92.2 కోట్లు అవుతుంది. తొమ్మిది రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలను పరిశీలించారు. ప్రతి రాష్ట్రంలో ఓటరు జనాభా అంచనాలు, ఓటరు నమోదు గణాంకాల ఆధారంగా భల్లా విడివిడిగా లెక్కలు వేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో జాబితాలో ఉండాల్సిన పేర్లు 53.51 కోట్లు కాగా.. తుది ఓటర్ల జాబితాల్లో ఉన్న పేర్లు 52.78 కోట్లు. రెండింటి మధ్య తేడా 73 లక్షలు. భల్లా అంచనా ప్రకారం.. తొమ్మిది రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో సుమారు 73 లక్షల పేర్లు కనిపించడం లేదు. తుది ఓటర్ల జాబితాలు వెలువడిన రాష్ట్రాల్లో సుమారు 5.8 కోట్ల తొలగింపులు జరిగాయని భల్లా పేర్కొన్నారు. వీటిలో సుమారు 5.1 కోట్ల తొలగింపులు అవసరమైనవని ఆయన అంచనా వేశారు. మిగిలిన సుమారు 70 లక్షల తొలగింపులకు తగిన వివరణ లేదని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..

Updated Date - Oct 18 , 2026 | 05:51 PM