గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం.. మట్టి దిబ్బ కూలి ఏడుగురి మృతి
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:42 AM
హరియాణాలో విషాదం చోటు చేసుకుంది. ఓ భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: హరియాణాలోని గురుగ్రామ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో భారీ మట్టి దిబ్బ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై తక్షణ చర్యలు చేపట్టిన అక్కడి అధికార యంత్రాంగం.. సంబంధిత ప్రాజెక్ట్, సైట్ ఇన్‌ఛార్జిలను అరెస్ట్ చేయించింది. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.
ఇదీ ఘటన..
గురుగ్రామ్‌లోని సిద్ధ్రావలి ప్రాంతంలో ఓ ప్రైవేట్ ప్రాంతంలో భారీగా మట్టి దిబ్బను పోగుచేశారు. ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడే భవనం నిర్మాణం కోసం పనిచేస్తున్న సుమారు 20 మందికి పైగా కార్మికులు దానికింద చిక్కుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 7 మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురిని రక్షించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. మట్టిదిబ్బల కింద ఇంకా పది మందికిపైగా కార్మికులు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ నాణ్యతలో లోపాలేమైనా ఉన్నాయా లేక మరేవైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు!
తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే.. ఆ పార్టీనే అధికారంలోకి..