కేంద్రం కీలక నిర్ణయం.. ఏటీఎంలలో ఇకపై చిన్న నోట్ల ఉపసంహరణ!
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:32 AM
చిన్న మొత్తాల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న నోట్ల కొరతపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏటీఎంలలో సాధారణంగా ఎప్పుడు నగదు విత్‌డ్రా చేసినా పెద్ద కరెన్సీ నోట్లే వస్తాయి. రూ.100, రూ.200, రూ.500 నోట్లతో చిన్నపాటి లావాదేవీల సమయంలో కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రూ.10, రూ.20, రూ.50 తరహా కరెన్సీ నోట్లు ఏటీఎంలలో ఎందుకు రావనే ప్రశ్న చాలామందిలో మెదిలే ఉంటుంది. ఇటీవల చాలా సందర్భాల్లో చిన్న నోట్ల చలామణి తగ్గడంతో.. వాటి కొరత ఏర్పడిందనే ఊహాగానాలూ వినిపించాయి. దీనిపై పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టతనిచ్చింది.
దేశంలో చిన్న కరెన్సీ నోట్ల కొరతేమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు రాజ్యసభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 'ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతమున్న సంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవు. ఈ సమస్యను అధిగమించేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మెషీన్లను పరీక్షిస్తున్నారు. ఈ మెషీన్ల ద్వారా రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది' అని సభాముఖంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. ఏటీఎంల నుంచి చిన్న నోట్లను తీసుకోవడంతో రోజువారీ లావాదేవీల్లో పెద్ద నోట్ల మార్పిడి సమస్యకు చెక్ పడే అవకాశముంది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2026 ఫిబ్రవరి వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.439.4 కోట్ల విలువైన రూ.10 నోట్లు, రూ.193.7 కోట్ల విలువ చేసే రూ.20 నోట్లు, రూ.130.3 కోట్ల విలువ గల రూ.50 నోట్లు ఉన్నాయి. ఇక గత ఆర్థిక ఏడాదిలో రూ.10 నోట్లు - రూ.150 కోట్లు, రూ.20 నోట్లు - రూ.150 కోట్లు, రూ.50 నోట్లు - రూ.300 కోట్లు సరఫరా చేసింది.
ఇవీ చదవండి:
ఆర్థిక సేవల రంగంలో భారీ జీతాలు
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..