Share News

స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:20 AM

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరిగింది. అద్భుతమైన శీర్షికలను సృష్టించడం కోసమే ప్రతిపక్షాలు స్పీకర్‌ను తొలగించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని అధికారపక్ష....

స్పీకర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు!

  • ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది

  • రాహుల్‌ను మాట్లాడనివ్వడం లేదు

  • స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో విపక్ష సభ్యుల విమర్శలు

  • విపక్ష సభ్యులకే స్పీకర్‌ ఎక్కువ అవకాశాలిచ్చారు

  • రాహుల్‌కు సభ అంటే గౌరవమే లేదు: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

న్యూఢిల్లీ, మార్చి 10: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరిగింది. అద్భుతమైన శీర్షికలను సృష్టించడం కోసమే ప్రతిపక్షాలు స్పీకర్‌ను తొలగించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని అధికారపక్ష సభ్యులు విమర్శించగా.. స్పీకర్‌ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విపక్ష సభ్యులు ఆరోపించారు. కొందరు మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేశారని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి కీలక అంశాలపై మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో ఈ తీర్మానంపై చర్చను కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ ప్రారంభించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, సభా గౌరవాన్ని రక్షించేందుకే లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్పీకర్‌ తటస్థంగా ఉంటారని అందరూ ఆశిస్తారన్నారు. కానీ, ఓం బిర్లా సభలో రాహుల్‌ గాంధీకి మాట్లాడే అవకాశమే ఇవ్వరని చెప్పారు. స్పీకర్‌ అంటే సభా గౌరవానికి ప్రతీక అని, దేశ స్వాతంత్య్రం, స్వేచ్ఛకు చిహ్నమని తొలి ప్రధాని దివంగత జవహరల్‌ లాల్‌ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్పీకర్‌ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా సభ్యులందరితో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారని.. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని బాధతో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడితోనే ఆయన సరిగా విధులు నిర్వర్తించడం లేదన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు జోక్యం చేసుకుంటూ.. కాంగ్రెస్‌ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఎలాంటి పక్షపాతంతో వ్యవహరించలేదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించారని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చారన్నారు. సభలో స్పీకర్‌ నిర్ణయమే అంతిమమని, దానికి సభ్యులందరూ కట్టుబడాలన్న మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్‌ గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం తమకు ఇష్టం లేదని, రాజకీయ ఒత్తిడితోనే పెట్టాల్సి వచ్చిందంటూ 50 మంది విపక్ష సభ్యులు తనతో చెప్పారని రిజిజు వెల్లడించారు. రాహుల్‌ గాంధీకి అసలు సభ అంటేనే గౌరవం లేదని, సమావేశాలకు హాజరవకుండా విదేశాలకు విహార యాత్రలకు వెళ్తుంటారని దుయ్యబట్టారు. ఆయన కంటే ప్రతిపక్ష నేతగా ప్రియాంక ఉండడం మంచిదని అన్నారు. కాగా, ఈ చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా సభలో లేరు. అవిశ్వాస తీర్మానంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందనతో బుధవారం ఈ చర్చ ముగియనుంది.

Updated Date - Mar 11 , 2026 | 04:20 AM