సీఎం భార్యకు మూడు పాస్‌పోర్ట్‌లు... స్పందించిన హిమంత్ బిశ్వా శర్మ
ABN , Publish Date - Apr 05 , 2026 | 08:54 PM
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ భార్య మూడు విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టంచాయి. అయితే ఈ ఆరోపణలను హిమంత బిశ్వా శర్మ తోసిపుచ్చారు.
గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ (Himanta Biswa Sharma) భార్య మూడు విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టంచాయి. అయితే ఈ ఆరోపణలను హిమంత బిశ్వా శర్మ తోసిపుచ్చారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిన వారిని జవాబుదారీ చేస్తామని హెచ్చరించారు.
వివాదం ఏమిటి?
హిమంత్ బిశ్వా శర్మ భార్య రినికి భూయాన్ శర్మ వద్ద మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పవన్ ఖేరా ఆదివారంనాడిక్కడ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణ చేశారు. యూఏఈ నుంచి ఆమెకు ఒక పాస్‌పోర్ట్ ఉందని, 2022 మార్చి 14న జారీ చేసిన ఆ పాస్‌పోర్టు గడువు 2027 మార్చి 13న ముగుస్తుందని చెప్పారు. ఆంటిగ్వా బార్బుడా దేశం నుంచి ఆమె పేరుతో రెండో పాస్‌పోర్టు 2021 ఆగస్టు 26న జారీ అయిందని, దాని గడువు 2031 ఆగస్టు 25తో ముగుస్తుందని వెల్లడించారు. ఈజిప్ట్ నుంచి మూడో పాస్‌పోర్ట్ కూడా 2022 ఫిబ్రవరి 13న ఆమె పేరుతో జారీ అయిందన్నారు. అది 2029 ఫిబ్రవరిలో ఎక్స్‌పైర్ అవుతుందని చెప్పారు. హిమంత్ బిశ్వా శర్మ రాజకీయ జీవితమంతా ముస్లింలపై విద్వేషంతోనే గడిచిందని, కానీ ఆయన భార్య రెండు ముస్లిం దేశాల నుంచి పాస్‌పోర్టులు కలిగి ఉందని పవన్ ఖేరా ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత దేశం నుంచి పారిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. శర్మ భార్యకు దుబాయిలో, యూఎస్ రాష్ట్రం వయోమింగ్‌లో సొంతంగా రెండు ఆస్తులు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. అయితే వీటి గురించి ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం వెల్లడించలేదని పేర్కొన్నారు.
ఓటమి తప్పదనే నిరాశతోనే ఆరోపణలు: సీఎం
పవన్ ఖేరా చేసిన ఆరోపణలను హిమంత్ బిశ్వా శర్మ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉందని, ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో పవన్ ఖేరా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. సత్యం బయటపడుతుందని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారు జవాబుదారీ అవుతారని అన్నారు. పవన్ ఖేరా తప్పుడు ప్రచారానికి తెరపడుతుందని, ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీకి తమిళనాడుకు మధ్య జరుగుతున్న ప్రజాస్వామ్య పోరు ఇది: స్టాలిన్
మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ మొదలైంది: మోదీ