చదువు కోసం పెళ్లిని ఆపిన గిరిజన బాలిక.. ప్రపంచ వేదికపై ప్రశంసల జల్లు
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:54 PM
చిన్న వయసులోనే పెళ్లి చేయాలన్న కుటుంబ నిర్ణయాన్ని ధైర్యంగా ఎదుర్కొంది మధ్యప్రదేశ్‌కు చెందిన హీమా నినామా. చదువును కొనసాగించాలన్న పట్టుదలతో బాల్య వివాహాన్ని అడ్డుకుని, ఇప్పుడు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. ఈ క్రమంలోనే హీమాను ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా తరచూ ఏదో ఒక ప్రాంతంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పెద్దల బలవంతంతో ఎంతోమంది ఆడపిల్లలు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం తల్లిదండ్రులను ఎదిరించి..బాల్య వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. కొందరు ఆడపిల్లలు తమ పోరాట పటిమతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందిన బాలికనే మధ్యప్రదేశ్‌కు చెందిన హీమా నినామా. కుటుంబ ఒత్తిడికి తలొగ్గకుండా తన బాల్య వివాహాన్ని అడ్డుకుని, చదువులో రాణిస్తున్న 17 ఏళ్ల హీమా నినామా (Heema Ninama) కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిస్తోంది. ఈమె ధైర్యసాహసాలను ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, యునిసెఫ్ (UNICEF) గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మరి.. హీమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝాబువా జిల్లా బర్ఖేడా గ్రామానికి చెందిన భిల్ (Bhil) గిరిజన తెగకు చెందిన హీమా తల్లిదండ్రులు నిరక్షరాస్యులైన రోజువారీ కూలీలు. హీమాకు నడవడంలో కొంత శారీరక వైకల్యం ఉంది. ఈ క్రమంలో హీమాకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. 11వ తరగతి చదువుతుండగా హీమాకు కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్న తరుణంలో హీమా పెళ్లికి ఒప్పుకోలేదు. తాను బాగా చదువుకుని స్వశక్తితో ఎదగాలని తల్లిదండ్రులకు తెలిపింది. అంతేకాక తాను చదువుతున్న కళ్యాణ్పురాలోని సందీపని విద్యాలయ ప్రిన్సిపల్ జ్ఞానేంద్ర ప్రసాద్ ఓఝా, ఉపాధ్యాయులను ఆశ్రయించింది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు హీమా తల్లిదండ్రులకు బాల్య వివాహ నిషేధ చట్టం, చదువు ప్రాముఖ్యతపై కౌన్సెలింగ్ ఇవ్వడంతో వారు మనసు మార్చుకుని వివాహాన్ని రద్దు చేశారు.
ఆ తర్వాత పట్టుదలతో చదివిన హీమా 11వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. నడకలో ఇబ్బంది ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడల్లోనూ అడుగుపెట్టి, జిల్లా స్థాయి షాట్‌పుట్, పరుగు పందెం పోటీల్లో పతకాలు గెలుచుకుంది. భవిష్యత్తులో ఉపాధ్యాయురాలిగా మారి, తనలాంటి గిరిజన ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని హీమా చెబుతోంది.
ఇటీవల యునిసెఫ్ బృందం హీమా గ్రామాన్ని సందర్శించి ఆమె ప్రయాణంపై ఒక లఘు చిత్రాన్ని (డాక్యుమెంటరీ) రూపొందించింది. నవంబర్ 20న 'ప్రపంచ బాలల దినోత్సవం' సందర్భంగా డేవిడ్ బెక్‌హామ్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. సరైన ప్రోత్సాహం, అవకాశాలు లభిస్తే ఆడపిల్లలు అద్భుతాలు సృష్టించగలరని, తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోగలరని బెక్‌హామ్ కొనియాడారు. ఫుట్‌బాల్ దిగ్గజమే తన గురించి ప్రస్తావించడంతో హీమా హర్షం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..
పుణే జిల్లా కోర్టు వద్ద కాల్పులు, కొడవళ్లతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు