ఆలయ యంత్రాంగం నిరాకరించినందువల్లే దీపం వెలిగించలేపోయాం.. సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం నివేదిక
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:26 PM
తమిళనాడులో మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ యంత్రాంగం అనుమతి నిరాకరించడమే అందుకు కారణమని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించలేకపోయామని తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ యంత్రాంగం అనుమతి నిరాకరించడమే అందుకు కారణమని వెల్లడించింది. ఈనెల 24న దీపస్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి అమలుకు సంబంధించి ప్రభుత్వం ఈ మేరకు ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఏటా దీపస్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అయితే, నవంబర్ 24న మాత్రం ఒకసారి దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది.
దీపస్తంభం సమీపంలో దర్గా ఉండడంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీపస్తంభంపై దీపం వెలిగించడం సంప్రదాయంలో భాగం కాదన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను హిందూ సంఘాలు ఖండించాయి. దీపం వెలిగించే సమన్వయ బాధ్యతలు నిర్వర్తిసున్న మదురై కలెక్టర్ కృష్ణ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు తాను అన్ని విధాలా ప్రయత్నించానని అందులో పేర్కొన్నారు. అయితే, దీపస్తంభంపై దీపం వెలిగించడం వల్ల ఆలయంలో అమలవుతున్న సంప్రదాయాలు, ఆచారాలకు భంగం కలుగుతుందని ఆలయ యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోని సంప్రదాయ ప్రదేశంలోనే దీపం వెలిగించామని, దీపస్తంభంపై వెలిగించలేకపోయామని వివరించారు.
మరోవైపు, మద్రాస్ హైకోర్టులో పిటిషనర్‌గా ఉన్న రామ రవికుమార్.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఒకరోజు ముందే హామీ ఇచ్చి, తర్వాత వాటిని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. దీపస్తంభంపై దీపం వెలగకుండా చేసేందుకు ఆలయ ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఉపయోగించుకుందని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే, ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందుకోసం పిటిషనర్లు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. పిటిషన్ అందిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు
ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు