Share News

పుణే జిల్లా కోర్టు వద్ద కాల్పులు, కొడవళ్లతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:23 PM

పుణేలోని శివాజీ నగర్ జిల్లా కోర్టు వద్ద కొందరు వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి.. కొడవళ్లతో దాడి చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.

పుణే జిల్లా కోర్టు వద్ద కాల్పులు, కొడవళ్లతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

పుణే, నవంబర్ 25: స్థానిక శివాజీ నగర్ జిల్లా కోర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం పట్టపగలు దారుణ ఘటన చోటు చేసుకుంది. విచారణకు వచ్చిన ఓ హత్య కేసు నిందితుడిపై దుండగులు కాల్పులకు యత్నించి, కొడవళ్లతో దాడి చేసి చేతిని నరికేశారు. కోర్టు ఆవరణలోనే ఈ దాడి జరగడంతో సందర్శకులు, న్యాయవాదులు భయాందోళనకు గురయ్యారు.

బుధవారం మధ్యాహ్నం సుమారు 1.00 గంట సమయంలో కోర్టు గేట్ నంబర్ 4, ఫ్యామిలీ కోర్టుకు ఎదురుగా ఈ దాడి జరిగింది. దుండగులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ఒక బైక్ పై నలుగురు, మరో బైక్ పై ముగ్గురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి వద్ద రెండు పిస్టళ్లు, కొడవళ్లు ఉన్నాయి.


బాధితుడిని మందార్ కివాలేగా గుర్తించారు. కత్రాజ్ ప్రాంతంలో 2025లో జరిగిన శుభమ్ చవాన్ హత్య కేసులో అతడు నిందితుడు. ఆ కేసు విచారణ కోసమే అతడు కోర్టుకు వచ్చాడు.

ముందుగా దుండగులు అతనిపై పిస్టల్‌తో కాల్పులు జరిపారు. ఆ తర్వాత కొడవళ్లతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మందార్ ఎడమ చేతి మణికట్టు వద్ద నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.


స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో అతడిని ససూన్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో పోలీసులు రెండు పిస్టళ్లు, ఒక మ్యాగజైన్, ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ ఘటనపై ఆరా తీశారు. కోర్టు వద్దే దాడి జరగడం పట్ల న్యాయవాదులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు వద్ద భద్రత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


నాలుగు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన కివ్లే..

భూమి, ఆర్థిక వివాదాల నేపథ్యంలో 2025 ఏప్రిల్‌లో పుణేలోని సంతోష్‌నగర్ కాత్రజ్ ప్రాంతంలో శుభం సుభాష్ చవాన్ అనే వ్యక్తి హత్య కేసులో కివ్లే జైలుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ దాడి జరగడానికి నాలుగు రోజుల క్రితమే అతను జైలు నుంచి విడుదలైనట్లు తెలుస్తుంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

మీరట్‌లో షాకింగ్ ఘటన.. నడిరోడ్డుపై యువతిని ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు!

Updated Date - Nov 25 , 2026 | 04:10 PM