పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలు!
ABN , Publish Date - Jun 30 , 2026 | 08:41 AM
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో కనీసం 15 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 4:00 నుంచి 5:00 గంటల మధ్య నాఫ్తా తరలిస్తున్న పైపులైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
గాయపడిన వారిని వెంటనే రక్షించి హల్దియా సబ్-డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా రిఫైనరీ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పైప్‌లైన్‌లో సాంకేతిక లోపమా, లీకేజీ కారణమా లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం సంభవించిందా అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్‌రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News