Share News

హెచ్‌ఏఎల్‌కు మరో 3 జీఈఎఫ్ 404 ఇంజిన్లు.. తేజస్‌కు మరింత బలం

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:43 PM

దేశీయ తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్‌ మాక్‌-1ఏ'కు కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌ తాజాగా మరో మూడు ఎఫ్‌404-ఐఎన్20 ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌కు అందించింది.

హెచ్‌ఏఎల్‌కు మరో 3 జీఈఎఫ్ 404 ఇంజిన్లు.. తేజస్‌కు మరింత బలం

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్‌ మాక్‌-1ఏ'కు కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌ తాజాగా మరో మూడు ఎఫ్‌404-ఐఎన్20 ఇంజిన్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు అందించగా.. గత నెలలో ఇవి భారత్‌కు చేరాయి. దీంతో తేజస్‌ మాక్‌-1ఏ కోసం ఇప్పటివరకు హెచ్‌ఏఎల్‌కు అందిన ఎఫ్‌404 ఇంజిన్ల సంఖ్య 10కి చేరింది. తేజస్‌ మాక్‌-1ఏ కోసం జీఈ ఏరోస్పేస్‌తో 2021లో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 99 ఎఫ్‌404-ఐఎన్20 ఇంజిన్ల సరఫరాకు సుమారు రూ.5,375 కోట్లతో ఈ డీల్ కుదిరింది.


తేజస్‌ సింగిల్‌ ఇంజిన్‌ యుద్ధ విమానం కావడంతో ఎఫ్‌404-ఐఎన్20 కీలకంగా మారింది. దేశీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఇంజిన్‌లో అధిక సామర్థ్యం కలిగిన ఫ్యాన్‌, సింగిల్‌ క్రిస్టల్‌ టర్బైన్‌ బ్లేడ్లు తదితర ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు. ఎఫ్‌404 కుటుంబంలో భారత తేజస్‌ కోసం రూపొందించిన వేరియంట్‌ అత్యధిక థ్రస్ట్‌ అందించే వాటిలో ఒకటిగా జీఈ ఏరోస్పేస్‌ పేర్కొంది.


కాగా.. గతంలో తేజస్‌ కోసం 65 ఎఫ్‌404-ఐఎన్20 ఇంజిన్లను జీఈ ఏరోస్పేస్‌ సరఫరా చేసింది. 2016లో ఆ సరఫరా పూర్తవడంతో ఈ ప్రత్యేక వేరియంట్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే.. 2021లో మరో 99 ఇంజిన్లకు ఆర్డర్‌ రావడంతో సుమారు ఐదేళ్ల విరామం తర్వాత జీఈ ఈ ఇంజిన్‌ ఉత్పత్తిని మరలా ప్రారంభించింది. తేజస్‌‌తో జీఈ ఏరోస్పేస్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 2004లో ఎఫ్‌404-ఐఎన్20ను తేజస్‌కు ఎంపిక చేశారు. తేజస్‌ ప్రారంభ విమాన పరీక్షల్లోనూ ఈ ఇంజిన్‌ కీలక పాత్ర పోషించింది. 2008లో తొలి పరీక్షా విమానంలో తేజస్‌ మాక్‌ 1.1 వేగాన్ని అందుకున్న విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి! షాకింగ్ వీడియో

యాసిన్ మాలిక్ సంచలన నిర్ణయం.. సరళా భట్ హత్య కేసులో కీలక ప్రకటన

Updated Date - Sep 03 , 2026 | 09:43 PM