నేపాల్ జలప్రళయంలో ప్రవాసీ గల్లంతు! ఆచూకీ తెలియక సన్నగిల్లుతున్న ఆశలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 09:38 PM
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్ జలప్రళయంలో గల్లంతైన తమ ఆత్మీయుల ఆచూకీ కోసం వారం రోజులుగా ఆశ నిరాశలతో ఎదురు చూస్తున్న కుటుంబాల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్ జలప్రళయంలో గల్లంతైన తమ ఆత్మీయుల ఆచూకీ కోసం వారం రోజులుగా ఆశ నిరాశలతో ఎదురు చూస్తున్న కుటుంబాల ఆశలు సన్నగిల్లుతున్నాయి. గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైన అనేక మృతదేహాలకు భారతీయ అధికారులు నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నమూనలను సేకరించి పంపిస్తున్నారు.
భారత్ నుంచి వెళ్లిన 19 మందితో కూడిన ప్రత్యేక వైద్యుల బృందాలు భారతదేశం నుంచి వస్తున్న నమూనాలను నేపాల్ అధికారులతో కలిసి కఠ్మాండూలోని రెండు ఫోర్సెనిక్ లాబొరేటరీలలో పరీక్షిస్తూ గుర్తింపును నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో ఖతర్‌లో పని చేస్తూ సరోవర యాత్రకు వెళ్లిన కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన చొప్పరపు రమేశ్ బాబు కుటుంబం కూడా ఆశలు వదులుకోగా, ఖతర్‌లోని అతని మిత్రులు కూడా నిరాశ చెందుతున్నారు.
రమేశ్ బాబు గత దశాబ్దానికి పైగా ఖతర్‌లోని ఒక అగ్రగామి సంస్థలో సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పని చేస్తున్నారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన కొంత మంది తెలుగు ప్రవాసీయులలో ఒకరైన ఆయన నేపాల్ – టిబేట్ సరిహద్దులో గత వారం సంభవించిన జలప్రళయంలో గల్లంతయ్యారు. వందలాది మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తుండగా కొందరు సజీవంగా కూడా హిమాలయ కొండల్లో లభిస్తున్నారు. అయితే, రమేశ్ బాబు కూడా సజీవంగా ఉండవచ్చన్న భావనతో ఉన్న అతని శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యుల ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. విపత్తు విరుచుకుపడిన గత బుధవారం ఉదయం నుంచి రమేశ్ బాబు ఫోన్ చేయకపోవడంతో అతని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. వరద ఉధృతిలో ఫోన్ గల్లంతైనా, రమేశ్ బాబు ఎక్కడో హిమాలయ పర్వత బురదలో చిక్కుకుని, సజీవంగా ఉంటారని అతని మిత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు.
రమేశ్ బాబు పిల్లలు సాయి అఖిల్, అలేఖ్యల డీఎన్ఏ నమూనాలను అధికారులు సిద్ధం చేసి నేపాల్‌లోని అధికారులకు పంపిస్తున్నారు.
బుధవారం వరకు మొత్తం 166 మంది భారతీయులను సురక్షితంగా కాపాడగా గుర్తుపట్టలేని అనేక మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ఫోరెన్సిక్ బృందం ఒకటి నేపాల్‌కు వెళ్లింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొత్తం 17 మంది ప్రవాసీయులు కైలాస యాత్రకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో మంగళగిరిలోని ఏపీ ఎన్నార్టీఎస్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
విపత్కర పరిస్థితుల్లో చిత్తశుద్ధితో ప్రయత్నాలు కొనసాగించడంతో పాటు బాధిత కుటుంబాల కోసం ప్రార్ధనలు చేయడమే తమ ముందున్న మార్గమని ఖతర్ లోని ఏపీ ఎన్నార్టీఎస్ ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పునుగోటి రవి వ్యాఖ్యానించారు. ఖతర్‌లోని ప్రతి తెలుగు ప్రవాసీ సుఖదుఃఖాల్లో అండగా తాముంటామని రవి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తానా మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం
డల్లాస్‌లో నేడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు