నాలుగు నెలల కనిష్ఠానికి చమురు ధరలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:14 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, జూన్ 24: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలర్ విలువతో పాటు చమురు ఉత్పత్తి, రవాణా పెరుగుతున్న నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.
పెట్రో ధరలు తగ్గుతాయా?
ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ (Brent Crude Oil) బ్యారెల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి తగ్గి ఇవాళ 72.24 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. హోర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు మొదలవడం, ఇరాన్ చమురుకు అమెరికా ఆంక్షల మినహాయింపుల వంటి కారణాలతో మార్కెట్‌లో చమురు లభ్యత పెరిగింది. దీంతో వీటి ధరలు దిగొస్తున్నాయి. ఫలితంగా భారత్‌పై దిగుమతుల భారం తగ్గుతోంది. మరోవైపు, రూపాయి విలువ పుంజుకోవడంతో పాటు ద్రవ్యోల్బణ భయాలు వీడే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ పరిణామాలతో సామాన్య వినియోగదారులకు తక్షణ ఊరట ఎంతవరకూ లభించే అవకాశం ఉందనేది చూడాలి.

కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయి.. ట్రంప్ ఫైర్
ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ముడి చమురు ధరలు వేగంగా పడిపోతున్నప్పటికీ, పెట్రోల్ బంకుల వద్ద విక్రయించే ధరలను పెద్ద పెద్ద చమురు కంపెనీలు ఆ స్థాయికి తగ్గించడం లేదని ట్రంప్ మండిపడ్డారు. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ముడి చమురు ధరలు ఇంత వేగంగా పడిపోతున్నా చమురు కంపెనీలు మాత్రం రిటైల్ ధరలను తగ్గించడం లేదు. మరో మాటలో చెప్పాలంటే, వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తూ వారిని నిలువునా దోచుకుంటున్నారు. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించాలని నేను అమెరికా న్యాయ శాఖను (DOJ) ఆదేశించాను. ప్రస్తుతం మార్కెట్‌లో కనిపిస్తున్న దానికంటే పెట్రోల్ ధరలు చాలా వేగంగా తగ్గాల్సిందే' అని ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి:
ఆలయాల అభివృద్ధికి రూ.9.54 కోట్లు
చంద్రబాబుతో ఆర్టీసీకి ముప్పే: షర్మిల
Read Latest AP News And Telangana News And International News And Telugu News