ఆలయాల అభివృద్ధికి రూ.9.54 కోట్లు
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:49 AM
తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఆరు ఆలయాలకు రూ.9.54 కోట్లు కేటాయించారు.
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి కేటాయింపు
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఆరు ఆలయాలకు రూ.9.54 కోట్లు కేటాయించారు. ఈమేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 28న టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దేవదాయ శాఖ సెక్రటరీ హరిజవహల్‌లాల్ మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మూడు ఆలయాలు కూడా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, సిద్ధిపేట జిల్లా దొమ్మాటలోని మహాకాళీశ్వర ఆలయానికి రూ.4.60 కోట్లు, సంగారెడ్డి జిల్లా కిచనపల్లిలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.1.09 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మన రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా సిద్ధయ్యగుంటలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.50.85 లక్షలు, అనకాపల్లి జిల్లా మునగపాకలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.1.75 కోట్లు, కర్నూలు జిల్లా హుస్సేనాఫురంలోని శ్రీసుంకాళమ్మ, మారేమ్మ ఆలయానికి రూ.1.10 కోట్లు కేటాయించారు.