Share News

శిశువుల ఆహార ఉత్పత్తుల విషయంలో FSSAI కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 17 , 2026 | 08:22 PM

ఆరు నెలల వరకు వయసున్న శిశువులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల విషయంలో ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ (FSSAI) కీలక సూచనలు చేసింది. పిల్లల ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌వంటి చక్కెరలను కలపడాన్ని నిషేధించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతిపాదనలు చేసింది.

శిశువుల ఆహార ఉత్పత్తుల విషయంలో FSSAI కీలక నిర్ణయం
FSSAI baby food

ఇంటర్నెట్‌ డెస్క్: ఆరు నెలల వరకు వయసున్న శిశువులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల విషయంలో ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ (FSSAI) కీలక సూచనలు చేసింది. పిల్లల ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌వంటి చక్కెరలను కలపడాన్ని నిషేధించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2020’కు సవరణ ముసాయిదాను ప్రచురించింది. పసితనంలోనే అదనపు చక్కెరలు తీసుకోవడాన్ని తగ్గించడం ద్వారా శిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చని తెలిపింది. అలానే పోషకాహార భద్రతను బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.


‘శిశువు ఎదుగుదలకు మొదటి ఆరు నెలలు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన పోషకాలు అందించేలా.. సంబంధిత ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లను కలపకుండా చూసేలా ఈ ప్రతిపాదనలను రూపొందించారు. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనే ప్రభుత్వ సిఫార్సులను ప్రోత్సహించేందుకూ ఈ చర్యలు ప్రయోజనం చేకూరుస్తాయి. బాల్యంలోనే ఊబకాయం, సంబంధిత ఆరోగ్య సవాళ్లను అరికట్టడం కూడా ఈ ప్రతిపాదనల ఉద్దేశం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ముసాయిదా ప్రతిపాదనలపై 60 రోజుల్లోపు అభ్యంతరాలను, సూచనలను సమర్పించవచ్చని పేర్కొంది.


ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు.. పుట్టినప్పటి నుంచి 24 నెలల వయసు వరకు ఉన్న పిల్లల కోసం ఉద్దేశించిన వివిధ రకాల పోషకాహార ఉత్పత్తులకు సమగ్ర పోషక కూర్పు, నాణ్యత, భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి. అలానే ఆరు నెలల వయస్సు వరకు ఉన్న శిశువుల ఆహార ఉత్పత్తుల్లో పరిమితి మేరకు సుక్రోజో, ఫ్రక్టోజ్‌ను చేర్చవచ్చు. అయితే తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతిపాదిత నిబంధన ప్రకారం... 6 నెలల వయసు వరకు ఉన్న శిశువుల ఆహార ఉత్పత్తుల్లో సుక్రోజ్, ఫ్రక్టోజ్‌ను చేర్చరాదు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Updated Date - Oct 17 , 2026 | 09:28 PM