భార్యను గొంతు నులిమి చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్!
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:10 PM
హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్టోబర్ 15 గురుగ్రామ్ సెక్టార్ 68లోని ప్రముఖ ఎం3ఎం మెరీనా (M3M Marina) అపార్ట్మెంట్లో ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొహమ్మద్ అస్లాం (30), కేరళకు చెందిన ఫర్హానా (28) కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరు గురుగ్రామ్ సెక్టార్ 68లో నివాసం ఉంటున్నారు. అస్లాం సెక్టార్ 58లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఫర్హానా గృహిణి. అక్టోబర్ 15న ఉదయం అస్లాం తన కంపెనీ సీనియర్ అధికారులకు ఒక ఇమెయిల్ పంపాడు. తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని, తన తండ్రికి, ఇంటి యజమానికి ఈ విషయాన్ని తెలియజేయాలని ఆ మెయిల్లో పేర్కొన్నాడు.
కంపెనీ అధికారులు వెంటనే అప్రమత్తమై అపార్ట్మెంట్ యజమానికి, ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. ఫర్హానా మృతదేహం నేలపై పడి ఉంది. మరో గదిలో అస్లాం ఫ్యాన్ హుక్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందం ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుంది. భార్యను గొంతు నులిమి చంపిన తర్వాతే అస్లాం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వీరి మధ్య గొడవలకు గల అసలు కారణం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్‌పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక