Share News

ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో ఐఏఎస్ అంటూ నమ్మించి పెళ్లి.. చివరకు అరెస్ట్

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:40 AM

ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో నకిలీ ఐఏఎస్ ఉన్నతాధికారిణిగా నటించి ఓ మహిళ.. యువకుడిని మోసం చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది

ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో ఐఏఎస్ అంటూ నమ్మించి పెళ్లి.. చివరకు అరెస్ట్
Fake IAS officer

ఇంటర్నెట్ డెస్క్, జులై 15 (ఆంధ్రజ్యోతి): ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో నకిలీ ఐఏఎస్ అధికారిణిగా నటించి ఓ మహిళ.. యువకుడిని మోసం చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బీఎస్సీ చదువుతున్న సాధన అనే యువతి సోషల్ మీడియాలో తాను ఐఏఎస్ ఉన్నతాధికారినని నమ్మించేలా నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించింది. ఫేస్‌బుక్‌లో ఫేక్ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ ఉన్నతాధికారిణిగా ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె ప్రొఫైల్‌ను చూసిన అభిషేక్ అనే యువకుడు ఆమె నిజంగానే ఐఏఎస్ అధికారిణి అని నమ్మి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే సాధన అసలు రూపం బయటపడింది.


వివాహానంతరం ఆమె భర్తపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. హాస్పిటల్ నిర్మాణం కోసం రూ.40 లక్షలు ఇవ్వాలని, అవసరమైతే వ్యవసాయ భూమిని కూడా విక్రయించాలని భర్తను డిమాండ్ చేసింది. ఈక్రమంలో భర్త పోలీసులను ఆశ్రయించాడు. డబ్బు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడటంతో పాటు భౌతికంగా దాడి చేసినట్లు భర్త ఫిర్యాదు చేశాడు. ఒకానొక దశలో గొంతు నులిమి చంపేందుకు కూడా ప్రయత్నించిందని బాధితుడు అభిషేక్ ఫిర్యాదులో తెలిపాడు.


ఈ కేసు విచారణలో సాధన తాను ఐఏఎస్ అధికారి కాదని, సోషల్ మీడియాలో నకిలీ గుర్తింపుతో వ్యవహరించిన విషయాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, ఈ మోసానికి సహకరించిన ఆమె తండ్రి, సోదరుడు, మామపై కూడా కేసులు నమోదు చేశారు.


భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే వివరాలను పూర్తిగా ధ్రువీకరించకుండా నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. బరేలీలో వెలుగుచూసిన ఈ నకిలీ ఐఏఎస్ అధికారిణి మోసం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగిస్తున్నాం: రామ్మోహన్

రాయలసీమను జగన్ ముంచేశారు.. సోమిరెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 01:24 PM