Devendra Fadnavis: ఉద్ధవ్ ఠాక్రేకు దమ్ముంటే.. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సవాల్
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:48 PM
మహారాష్ట్రలో ఉత్తరాది వారి గురించి ఫడ్నవిస్ మాట్లాడుతూ, వాళ్లేమీ పాకిస్థాన్ వాళ్లు కాదని చెప్పారు. ఉత్తరాది వారిని బయట వ్యక్తులుగా చిత్రీకరించడం, వాళ్ల పట్ల వివక్ష చూపించే ఎలాంటి చర్యలనైనా తాను వ్యతిరేకిస్తామని అన్నారు.
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మహాయుతి కూటమి మొత్తం 29 మేయర్ సీట్లనూ కైవసం చేసుకుంటుందని, ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్
ఠాక్రేపై విమర్శలు గుప్పించారు.
కూటమి రాజకీయాలపై ఫడ్నవిస్ మాట్లాడుతూ, శరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీకి ప్రస్తుతం ఎన్డీయేలో అవకాశం లేదన్నారు. 29 మున్సిపల్ కార్పొరేషన్లకూ మహాయుతి మేయర్లే ఉంటారని చెప్పారు. హిందువు, మరాఠీ వ్యక్తే మేయర్ అవుతారని స్పష్టం చేశారు. రాజ్ ఠాక్రే లాగే తాను కూడా హిందువునని, హిందీ కాదని, మరాఠీ వ్యక్తినని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని, హిందువులు, మరాఠీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలో ఉత్తరాది వారి గురించి మాట్లాడుతూ, వాళ్లేమీ పాకిస్థాన్ వాళ్లు కాదని చెప్పారు. ఉత్తరాది వారిని బయట వ్యక్తులుగా చిత్రీకరించడం, వాళ్ల పట్ల వివక్ష చూపించే ఎలాంటి చర్యలనైనా తాను వ్యతిరేకిస్తామని అన్నారు. 'ఉద్ధవ్‌కు ధైర్యం ఉంటే, వందేమాతరం, జైశ్రీరామ్ నినాదాలు ఇవ్వాలి' అని ఫడ్నవిస్ సవాల్ విసిరారు. 25 ఏళ్లపాటు బీఎంసీని పాలించిన వారే బ్రిహాన్ ముంబై కోసం ఏం చేశారో చెప్పాలని ఉద్ధవ్‌ను ఉద్దేశించి అన్నారు.
కాగా, బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈనెల 15న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 16న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. 29 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మొత్తం 2,869 మంది కార్పొరేటర్లను ఎన్నుకుంటారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్.. ఈసీపై మమత సంచలన ఆరోపణ
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి