Share News

బీఎంసీ మేయర్‌పై ప్రతిష్టంభన.. ఫడ్నవిస్, షిండే భేటీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:53 PM

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు వెళ్లిన ఫడ్నవిస్ ఆదివారంనాడు తిరిగి ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెలాఖరులో జరగాల్సి ఉండగా, బీజేపీ, శివసేన కౌన్సిలర్లు తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికి ఎన్నిక వాయిదా పడింది.

బీఎంసీ మేయర్‌పై ప్రతిష్టంభన.. ఫడ్నవిస్, షిండే భేటీ
Devendra Fadnavis with Shinde

ముంబై: బ్రహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ మేయర్ (Mayor) పదవి విషయంలో బీజేపీ, షిండే శివసేన మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. మేయర్ ఎన్నికకు మార్గం సుగమం చేసేందుకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం రాత్రి కానీ, మంగళవారం కానీ సమావేశమయ్యే అవకాశం ఉందని కూటమి వర్గాల సమాచారం.


దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు వెళ్లిన ఫడ్నవిస్ ఆదివారంనాడు తిరిగి ముంబైకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బీఎంసీ మేయర్ ఎన్నిక ఈ నెలాఖరులో జరగాల్సి ఉండగా, బీజేపీ, శివసేన కౌన్సిలర్లు తమ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికి ఎన్నిక వాయిదా పడింది.


బలాబలాలు

జనవరి 15న బీఎంసీ ఎన్నికల జరుగగా, 16న ఫలితాలు వెలువడ్డాయి. 227 మంది సభ్యుల బీఎంసీ ఎన్నికలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. షిండే శివసేన 29 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ-షిండే కూటమి 118 మంది కౌన్సిలర్లతో మెజారిటీ మార్క్‌ను దాటింది. ఎన్‌సీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కలిసినట్లయితే ఈ సంఖ్య 121కి చేరుతుంది. మహాయుతి భాగస్వామ్య పక్షమైన ఎన్‌సీపీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగింది. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన (యూబీటీ) 65 సీట్లు గెలుచుకోగా, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఎంఎన్‌ఎస్ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు సాధించింది. శరద్ పవార్ ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఒక్క సీటుకే పరిమితమైంది. బీఎంఎసీ ఎన్నికల్లో సేన యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేశాయి.


షిండే డిమాండ్ ఏమిటి?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని షిండే శివసేన డిమాండ్‌గా ఉంది. అయితే ఇందుకు బీజేపీ నిరాకరిస్తోంది. కనీసం ఏడాది పాటు అయినా బీఎంసీ మేయర్ పదవికి తమకు ఇవ్వాలని సేన చేసిన విజ్ఞప్తిని కూడా బీజేపీ నిరాకరించినట్టు చెబుతున్నారు. దీంతో డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులకు సేన ప్రస్తుతం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్, షిండే సమావేశమవుతుండటంతో బీఎంసీ కొత్త మేయర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం ఉందంటున్నారు.


ఇవి కూడా చదవండి..

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్

భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 05:59 PM