ఆ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం.!
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:13 PM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల దర్శన విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్(Badrinath), కేదార్‌నాథ్ ఆలయాల దర్శన విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతించనున్నారు. హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్ - కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ(BKTC) ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడనుంది. ఈ విషయాన్ని బద్రీనాథ్ - కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది స్వయంగా వెల్లడించారు. ఈ రెండు పుణ్యక్షేత్రాలతో పాటు కమిటీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే గంగోత్రి ధామ్‌లోకి హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం విధించారు.
ఈ మేరకు ఆదివారం జరిగిన శ్రీ గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారన్న విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బద్రీనాథ్ ఆలయ దర్శనం గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. శీతాకాలం నేపథ్యంలో ఆరు నెలల పాటు బద్రీనాథ్ ఆలయం మూసిఉంచిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 23న ఈ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌తో పాటు, చోటా చార్‌ధామ్‌లో భాగమైన ఇతర రెండు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి(Gangaotri, Yamunotri) ఆలయాల దర్శనం అక్షయ తృతీయ సందర్బంగా ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి..
శశిథరూర్‌తో సీపీఎం మంతనాలు.. ఆయన ఏమన్నారంటే..
భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య