భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:49 PM
భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం తనకు జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్ వ్యాఖ్యానించారు. భారత దేశ విజయంలో ప్రపంచానికి సుస్థిరత దాగుందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత దేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం, ఆమె తన మనసులో మాటను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత దేశ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు. భారత దేశ విజయ ప్రస్థానంతో ప్రపంచానికి శాంతిసౌభాగ్యాలు, సుస్థిరత లభిస్తాయని వ్యాఖ్యానించారు. అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. ఉర్సులాతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన విషయం తెలిసిందే.
తొలుత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్ముతో కలిసి ఉర్సులా, ఆంటోనియో కొస్టా ప్రెసిడెంట్ గార్డ్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక బగ్గీలో కర్తవ్యపథ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. రాష్ట్రపతితో పాటు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం, ప్రముఖులు పరేడ్‌ను వీక్షించారు.
ఇక రేపు భారత్, ఈయూ (ఐరోపా సమాఖ్య) మధ్య జరగనున్న శిఖరాగ్ర సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈయూతో భారత్ కుదుర్చుకోనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే భారత్‌కు ఈయూ ముఖ్య వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈయూ-భారత్‌ల వాణిజ్యం 135 బిలియన్ డాలర్లను దాటింది. ఒప్పందం తరువాత దైపాక్షిక వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి:
ఢిల్లీలో కన్నులపండువగా 77వ గణతంత్ర దినోత్సవం.. మిన్నంటిన సంబరాలు
భారత సైనిక శక్తిని చాటిన గణతంత్ర దినోత్సవ పరేడ్.. హైలైల్స్ ఇవే!