భారత సైనిక శక్తిని చాటిన గణతంత్ర దినోత్సవ పరేడ్.. హైలైల్స్ ఇవే!
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:13 PM
నేడు న్యూఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ సైనిక శక్తిని చాటేలా సాగిన పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్యాటిల్ అరే ఫార్మేషన్, ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శనలు అతిథులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నేడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పరేడ్ భారత సైనిక శక్తి పాటవాన్ని సగర్వంగా చాటిచెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో వాడిన పలు ఆయుధ వ్యవస్థలను సైనిక దళాలు కర్తవ్యపథ్ వేదికగా అచ్చెరువొందేలా ప్రదర్శించాయి. ఈ కవాతులో తొలిసారిగా బ్యాటిల్ అరే ఫార్మేషన్‌లో నిర్వహించిన కవాతు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యుద్ధ క్షేత్రంలో సైన్యాల మోహరింపును పోలినట్టు పరేడ్ నిర్వహించడం అతిథులు ఆశ్చర్యపోయేలా చేసింది (77th Republic Day Parade)
ఈ పరేడ్‌లో త్రివిధ దళాలకు చెందిన 6,050 సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో సాగిన ఆయుధ ప్రదర్శన భారత సైనిక పాటవాన్ని జగద్విదితం చేసింది. ఈ వేడుకల సందర్భంగా నాలుగు ఎమ్ఐ-17 హెలికాఫ్టర్లు పూల వర్షం కురిపించాయి. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకగా నిలిచిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన, 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంఛర్ అతిథులను ఆకట్టుకున్నాయి. అర్జున్ యుద్ధ ట్యాంకు ప్రదర్శన కూడా ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది.
భారత్‌కు అత్యంత కీలకంగా మారిన ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా ప్రదర్శించారు. అపాచీ, ప్రచండ్ హెలికాఫ్టర్లు, వివిధ యుద్ధ విమానాల గగనతల విన్యాసాలు మెప్పించాయి. డ్రోన్ ప్రదర్శన కూడా పరేడ్‌లో జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఈ కవాతులో కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సైనిక కవాతుతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, కళా ప్రదర్శనలు దేశ సాంస్కృతిక వైవిధ్యతను చాటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 శకటాలు దేశ ఖ్యాతిని ఇనుడింపచేశాయి. ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుంచి సుమారు 10 వేల మంది అతిథులు పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇవీ చదవండి:
ఢిల్లీలో కన్నులపండువగా 77వ గణతంత్ర దినోత్సవం.. మిన్నంటిన సంబరాలు
ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ