Share News

ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:20 AM

రాష్ట్రీయ జనతాదళ్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు. పాట్నాలో జరిగిన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశంలో...

ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ

  • పాట్నా సమావేశంలో లాలూ ప్రకటన

  • పరాజయానికి పట్టాభిషేకమంటూ బీజేపీ ఎద్దేవా

పాట్నా, జనవరి 25: రాష్ట్రీయ జనతాదళ్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు. పాట్నాలో జరిగిన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశంలో భార్య రబ్రీదేవి, కుమార్తె మిసా భారతి, పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఈ ప్రకటన చేశారు. లాలూ చిన్న కుమారుడైన తేజస్వీ యాదవ్‌ విపక్ష మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా ఇటీవలే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డారు. విపక్ష కూటమి చిత్తుగా ఓడిపోయి ఎన్డీయే ఘన విజయం సాధించింది. పరాజయానికి తేజస్వీ వైఖరే కారణమని లాలూ కుమార్తె, తేజస్వీ సోదరి రోహిణీ ఆచార్య ఆరోపించారు. ఒకప్పుడు బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన ఆర్జేడీ నేడు కుట్రదారులు, అక్రమ చొరబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. లాలూ వాదమనేదే లేకుండా చేశారని వాపోయారు. ఎన్నికల్లో పరాజయంపై ప్రశ్నించినందుకు తననే దూషించి ఇంటినుంచి గెంటేశారని గతంలో ఆమె ఆరోపించారు. మరోవైపు తేజస్వీ యాదవ్‌ను ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడం పరాజయానికి పట్టాభిషేకం చేసినట్లుందని బీజేపీ ఎద్దేవా చేసింది. అవినీతి, నేరమయ వారసత్వ రాజకీయాల పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తేజస్వీకి పట్టం కట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శించారు.

Updated Date - Jan 26 , 2026 | 05:21 AM