ఢిల్లీలో కన్నులపండువగా 77వ గణతంత్ర దినోత్సవం.. మిన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:17 PM
దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశభక్తి ఉప్పొంగింది. రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణ అనంతరం సాగిన సైనిక దళాల పరేడ్, వివిధ ఆయుధాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన, హెలికాఫ్టర్ విన్యాసాలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవంలో దేశభక్తి అంబరాన్నంటింది. రాష్ట్రపతి జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైన వేడుకలు కన్నులపండువగా సాగాయి. కర్తవ్యపథ్‌పై సైనిక దళాల కవాతు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు, భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం, వేదిక వద్ద ముఖ్య అతిథులు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాకు రాష్ట్రపతి ముర్ము స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయక బగ్గీలో ముఖ్య అతిథులతో కలిసి వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. కర్తవ్యపథ్ వద్ద వేదికపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది.
త్రివిధ దళాల పరేడ్‌తో గణతంత్ర దినోత్సవ కవాతు ప్రారంభమైంది. ఈ పరేడ్‌కు లెఫ్టెనెంట్ జనరల్ భవ్‌నీశ్ కుమార్ నేతృత్వం వహించారు. సైనిక దళాల కవాతుతోపాటు ప్రచండ్ హెలికాఫ్టర్‌ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే యూనిఫామ్‌తో అశ్వికదళం తొలిసారిగా పాల్గొనడం మరో ప్రత్యేకత. వందేమాతరం థీమ్‌తో సాగిన పరేడ్‌లో దేశ అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యత, ఆపరేషన్ సిందూర్ గొప్పదనాన్ని చాటేలా పలు ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. ఇక ఐరోపాకు చెందిన నలుగురు సైనిక అధికారులు తమ జెండాలతో జిప్సీ వాహనాల్లో పరేడ్‌లో పాలు పంచుకోవడం అతిథులను ఆకట్టుకుంటుంది.
ఈ వేడుకల్లో తొలిసారిగా బ్యాటిల్ ఎరే ఫార్మాట్‌లో భారత ఆర్మి కవాతును నిర్వహించింది. 61 కావల్రీ దళం, నిఘా కోసం ఉద్దేశించిన రీకానిసెన్స్ వాహనం, ఆపరేషన్ సిందూర్ జెండాతో ధ్రువ హెలికాఫ్టర్ విన్యాసం దేశసైనిక పాటవాన్ని చాటాయి.
ఈ వేడుక ప్రారంభానికి ముందు భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్రను అందుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ