Share News

విరిసిన తెలుగు పద్మాలు!

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:39 AM

వైద్య రంగం నుంచి కళా రంగం వరకు విశిష్ఠ సేవలు అందించిన తెలుగువారిని ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మ’ పురస్కారాలు వరించాయి. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్‌ జీవీ రావు, డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి.......

విరిసిన తెలుగు పద్మాలు!

  • వివిధ రంగాల్లో చేసిన కృషిని వరించిన పద్మశ్రీ పురస్కారం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

వైద్య రంగం నుంచి కళా రంగం వరకు విశిష్ఠ సేవలు అందించిన తెలుగువారిని ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మ’ పురస్కారాలు వరించాయి. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్‌ జీవీ రావు, డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి, విద్యా రంగంలో మామిడాల జగదీశ్‌కుమార్‌, విద్యావేత్త మామిడాల జగదీశ్‌కుమార్‌, క్షిపణి శాస్త్రవేత్త గడ్డమణుగు చంద్రమౌళి, కూచిపూడి కళాకారిణి దీపికారెడ్డి, ప్రసిద్ధ సంస్కృత పండితుడు వెంపటి, అభినవ అన్నమయ్య గరిమెళ్ల, పాడి పరిశ్రమలో విప్లవం సృష్టించిన మామిడి రాంరెడ్డి తదితరులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.

1.jpg

‘మచ్చలేని’ సర్జరీతో డాక్టర్‌ జీవీ రావు

ప్రపంచంలోనే అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుల్లో ఒకరైన ఏఐజీ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రావు(గుడూరు వెంకటరావు) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏఐజీ ఆస్పత్రి సహ వ్యవస్థాపకుడైన ఆయన.. 12 వేలకుపైగా జీర్ణాశయ శస్త్రచికిత్సలు, 16 వేలకుపైగా ఎండోస్కోపీ చికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించారు. పేషెంట్ల శరీరంపై ఎలాంటి మచ్చలూ పడకుండా, శస్త్రచికిత్స బయటికి కనబడకుండా ‘నో స్కార్‌ సర్జరీ’ని పరిచయం చేశారు. ఈ విధానంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్సోరల్‌ ఎండోస్కోపిక్‌ అపెండెక్టమీ సర్జరీ చేశారు. భారత మొట్టమొదటి సర్జికల్‌ సిమ్యులేటర్‌ను అభివృద్ధి చేయడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌తో కలిసి పనిచేశారు. మధుమేహం, ఫ్యాటీ లివర్‌, ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌ (ఐబీడీ) వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు కృషిచేశారు. పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాల్లో మొబైల్‌ ఎండోస్కోపీ, అలా్ట్రసౌండ్‌ పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. టెలీమెడిసిన్‌ నెట్‌వర్క్‌ దూరప్రాంతాల్లోని గ్రామాలను ఏఐజీ ప్రత్యేక వైద్య కేంద్రాలతో అనుసంధానం చేసి, వైద్య సేవలను అందిస్తున్నారు. తన సేవలకు గుర్తింపుగా డాక్టర్‌ బీసీ రాయ్‌ జాతీయ అవార్డు, ది ఎకనామిక్‌ టైమ్స్‌ ఇన్‌స్పైరింగ్‌ డాక్టర్స్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు, జేసీ అవుట్‌స్టాండింగ్‌ ఇంటర్నేషనల్‌ యంగ్‌ పర్సన్‌ అవార్డుతోపాటు పదుల సంఖ్యలో ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గౌరవ ఫెలోషి్‌పలు పొందారు. పద్మశ్రీ అవార్డు సమాజంపై తన బాధ్యతను మరింత పెంచిందని డాక్టర్‌ జీవీ రావు ఈ సందర్భంగా చెప్పారు. తన వృత్తి జీవితమంతా మద్దతుగా నిలిచిన డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.


2.jpg

భారత అంకాలజీకి మార్గదర్శకం.. విజయ్‌

భారత్‌లో క్యాన్సర్‌ చికిత్సల రంగానికి మార్గదర్శకుడిగా నిలిచిన అపోలో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ పాల్కొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డిని పద్మశ్రీ వరించింది. వైద్య పరీక్షల నివేదికలు, రోగి శరీరతత్వం ఆధారంగా తన అనుభవాన్ని మిళితం చేసి.. ప్రతి క్యాన్సర్‌ రోగికి ప్రత్యేకంగా చికిత్స అందించడం ఆయన ప్రత్యేకత. 20వేల మందికి పైగా క్యాన్సర్‌ రోగులకు చికిత్స చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన విజయ్‌ ఆనంద్‌రెడ్డి ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేశారు. తర్వాత అంకాలజీలో, రేడియేషన్‌ థెరపీలో ఎండీ చేశారు. ఆయన ఉమ్మడి ఏపీలో తొలి బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌, దేశంలో తొలిసారిగా ఇంట్రాకరోనరీ బ్రాకీ థెరపీ, రెటినోబ్లాస్టోమాకు తొలి ఇంట్రాఆర్టీరియల్‌ కీమోథెరపీ, కంటి క్యాన్సర్‌కు తొలి ఇంట్రా-ఆక్యులర్‌ బ్రాకీథెరపీ, గ్లియోమా, పెనిస్‌ క్యాన్సర్‌ బాధితులకు ఇంటర్‌స్టీషియల్‌ ఇంప్లాంట్‌ చికిత్సలు, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు అలా్ట్ర సౌండ్‌ గైడెడ్‌ ఇంప్లాంట్‌ చికిత్స నిర్వహించారు. ప్రొస్టేట్‌, రొమ్ము క్యాన్సర్ల చికిత్సలో తక్కువ వ్యవధితో రేడియేషన్‌ వినియోగించే విధానాలను అభివృద్ధి చేశారు. 2003లో క్యూర్‌ ఫౌండేషన్‌ స్థాపించి.. పేద క్యాన్సర్‌ రోగులకు ఉచితంగా/తక్కువ ఖర్చుతో పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నారు. 108 మంది క్యాన్సర్‌ విజేతల నిజ జీవిత కథలతో ‘ఐయామ్‌ సర్వైవర్‌’ పుస్తకం రాశారు. పద్మశ్రీ అవార్డు రావడం గర్వంగా ఉందని, ఇది తన సేవలకు దక్కిన ఫలితంగా భావిస్తానని విజయ్‌ ఆనంద్‌రెడ్డి చెప్పారు.

3.jpg

విద్యావేత్తకు విశిష్ఠ పురస్కారం

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన విద్యావేత్త మామిడాల జగదీశ్‌కుమార్‌ను పద్మశ్రీ వరించింది. మిర్యాలగూడలో డిగ్రీ, హైదరాబాద్‌లో పీజీ చేసిన ఆయన.. మద్రాస్‌ ఐఐటీలో ఎంఎస్‌, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1991 నుంచి 1994 వరకు కెనడాలోని వాటర్‌లూ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టొరియల్‌ పరిశోధన చేశారు. ఢిల్లీ ఐఐటీలోని ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. నానో ఎలకా్ట్రనిక్స్‌ విభాగంలో పరిశోధనల కోసం కృషిచేశారు. 2016 జూన్‌ 24 నుంచి 2019 జూన్‌ 23 వరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఇన్‌చార్జి చైర్మన్‌గా, 2022 ఫిబ్రవరి 4 నుంచి 2025 ఏప్రిల్‌ 7వరకు చైర్మన్‌గా పనిచేశారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కృషి చేశారు.


4.jpg

ఆకాశ్‌ శాస్త్రవేత్తకు.. ఆకాశమంత గౌరవం

రక్షణ రంగంలో కీలకమైన క్షిపణి శాస్త్రవేత్త గడ్డమణుగు చంద్రమౌళికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఆయన.. వరంగల్‌ ఆర్‌ఈసీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్‌ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. దాదాపు 34 ఏళ్లపాటు డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా పనిచేసి 2018లో రిటైరయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తగా చంద్రమౌళి ఆకాశ్‌ క్షిపణి అభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేశారు. ఆకాశ్‌ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ఆయన 2005లో డీఆర్‌డీవో అగ్ని అవార్డు పొందారు. 2007లో మోక్షగుండం విశ్వేశరయ్య అవార్డు, 2013లో డీఆర్‌డీవో సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు, 2014లో ఫిక్కీ నుంచి గ్లోబల్‌ లీడర్‌ అవార్డును పొందారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

5.jpg

కూచిపూడి నాట్యానికి పద్మం

ప్రముఖ కూచిపూడి నర్తకీమణి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ పూర్వ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డిని పద్మశ్రీ పురస్కారం వరించింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె.. ప్రఖ్యాత నాట్యాచార్యులు వెంపటి చినసత్యం దగ్గర శిక్షణ పొందారు. తన 11వ ఏటనే అరంగేట్రం చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వెయ్యికిపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దీపాంజలి నాట్యశిక్షణాలయాన్ని స్థాపించారు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రగతి, సమానత్వం, తెలుగు భాష ఔన్నత్యం వంటి సామాజిక అంశాలపైనా నృత్యరూపకాల ద్వారా అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అయోధ్య రామాలయ ప్రాంగణంలోనూ నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఉత్తమ కళాకారిణి పురస్కారం, కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు తదితర పురస్కారాలు పొందారు. పద్మశ్రీకి ఎంపికయిన ఆనందం మాటల్లో వర్ణించలేనిదని దీపికారెడ్డి పేర్కొన్నారు.


6.jpg

అభినవ అన్నమయ్య గరిమెళ్ల

సంగీతానికే అంకితమై పుంభావ సరస్వతిగా పేరు తెచ్చుకున్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. ఆయన 1948 నవంబరు 9న రాజమహేంద్రవరంలో జన్మించారు. 600కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరిచి వెలుగులోకి తెచ్చిన ప్రసిద్ధ గాయకుడు ఆయన. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా పనిచేస్తూ భక్తి సంగీతానికి సేవలందించారు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన లక్ష గళార్చనలో ప్రధాన గాయకులు. ఆ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్‌. జానకి సోదరి కుమారుడైన ఆయన సినిమా అవకాశాలు వచ్చినా శాస్త్రీయ సంగీతానికి, తిరుమల శ్రీవారి సేవకే అంకితమయ్యారు. గతేడాది మార్చి 9న కన్నుమూశారు.

7.jpg

ప్రసిద్ధ సంస్కృత పండితుడు వెంపటి

దేశంలోని మూడు ప్రసిద్ధ సంస్కృత వర్సిటీలకు ప్రసిద్ధ సంస్కృత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి ఉపకులపతిగా పనిచేశారు. ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నారు. 1950 ఆగస్టు 12న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో వెంపటి జగన్నాథం, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించిన వెంపటి కుటుంబశాస్త్రికి అద్వైత వేదాంతం, దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ సంస్కృత పండితుడిగా పేరుంది. ఆయన 2014లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. ‘‘ఊపిరి ఉన్నంత వరకు సంస్కృతాభివృద్ధికే నా సేవలందిస్తాను’’ అని పద్మశ్రీకి ఎంపికైన తర్వాత వెంపటి ఆంధ్రజ్యోతితో అన్నారు.

3.jpg

పాడికి ప్రోత్సాహం... పద్మశ్రీ పురస్కారం

పశుపోషణ, డెయిరీ రంగాల్లో విశేష సేవలందించిన మామిడి రామారెడ్డికి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన మామిడి రామారెడ్డి.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి భోజారెడ్డి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ బాటలో రాజకీయాల్లోకి ప్రవేశించి శంషాబాద్‌ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్‌ పంచాయతీ, రాజేంద్రనగర్‌ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు, అభివృద్ధిపై దృష్టిపెట్టారు. రాజకీయాలను వదిలేసి, ‘సీడీఎ్‌ఫ’(కో- ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ ఫౌండేషన్‌) ఏర్పాటుచేశారు. పశుపోషణ, పాడి నిర్వహణ, పొదుపు అంశాల్లో లక్షలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. హన్మకొండ జిల్లా ముల్కనూరులో మహిళా డెయిరీని కూడా ప్రారంభించారు. ఇప్పటికీ కొనసాగుతున్న ఆ డెయిరీ ఇప్పుడు ఏటా రూ.200 కోట్ల టర్నోవర్‌ చేస్తుండటం గమనార్హం. అమూల్‌ సంస్థను కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్‌ కురియన్‌, ఎన్సీ జైన్‌లతో కలసి పనిచేశారు. ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రాథమిక సహకార సంఘాలు నడిచేలా పోరాడారు. ఆయన పోరాటంతోనే రాష్ట్రం, కేంద్రం కూడా సంఘాలకు రక్షణ కల్పిస్తూ చట్టాలు చేశాయి. గత ఏడాది అక్టోబరులో ఆయన కన్నుమూశారు.

Updated Date - Jan 26 , 2026 | 04:39 AM