ఎన్నికల రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లు సీజ్
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:27 PM
తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ధనం, మద్యం, ఉచితాలతో ఓటర్లను ప్రలోభపెడుతుండటం చాపకింద నీరులా జరుగుతుంటుంది. ఇలాంటి ప్రలోభాలపై ఈసీ డేగకన్ను వేస్తుంటుంది. తాజాగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
పశ్చిమబెంగాల్‌లో రూ.472.89 కోట్లు, తమిళనాడులో రూ.599 కోట్లు విలువచేసే నగదు, మద్యం, ఆభరణాలు, డ్రగ్స్, ఉచితాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.127.67 కోట్ల నగదు, రూ.106.3 కోట్ల విలువైన మధ్యం, రూ.184.83 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.215.19 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.437.97 కోట్ల విలువైన ఇతర ఉచితాలు ఉన్నట్టు ఈసీ తెలిపింది.
తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 23న జరుగనుంది. తమిళనాడులో ఒక విడతలో పోలింగ్ జరుగనుండగా, బెంగాల్‌లో రెండు విడతలుగా జరుగునుంది. అక్కడ రెండో విడత పోలింగ్ ఈనెల 29న ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు ఇప్పటికే పోలింగ్ పూర్తయిన అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి..
ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడం సరికాదు.. మమతాబెనర్జీ చర్యను తప్పుపట్టిన సుప్రీం
భారత్‌ను ప్రమాదంలో పడెయ్యాలని చూస్తే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్..