Share News

ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడం సరికాదు.. మమతాబెనర్జీ చర్యను తప్పుపట్టిన సుప్రీం

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:16 PM

ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టటం సరికాదని వ్యాఖ్యానించింది.

ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టడం సరికాదు.. మమతాబెనర్జీ చర్యను తప్పుపట్టిన సుప్రీం
Mamata Banerjee and Supreme court

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ (I-PAC) సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ బుధవారంనాడు జరుగనున్న తరుణంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా గత జనవరిలో ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడులు జరిపింది. విషయం తెలిసిన మమతాబెనర్జీ అక్కడకు చేరుకుని ఈ దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రతీక్ జైన్ నివాసం నుంచి ఒక ల్యాప్‌టాప్, ఫోన్, పలు ఫైళ్లు తీసుకుని వెళ్లిపోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధమని మమతా బెనర్జీ తప్పుపట్టారు. రాజకీయ దురుద్దేశంతో ఈ దాడులు జరిపించారని, అసెంబ్లీ ఎన్నికల వేళ తమ పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మమతా బెనర్జీ చర్యలను ఈడీ తప్పుపట్టింది. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది. మమతా బెనర్జీ, ఇతర అధికారులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును అశ్రయించింది.


దీనిపై న్యాయమూర్తులు పీకే మిశ్రా, ఎన్‌వీ అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరుపుతోంది. మమతా బెనర్జీ చర్య ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. 'ఇది రాష్ట్రం, కేంద్రం మధ్య వివాదం కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విచారణ మధ్యలో జోక్యం చేసుకుని ప్రజ్వాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టకూడదు. దీనిని కేంద్ర, రాష్ట్ర వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం సరికాదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి విచారణ మధ్యలోకి చొరబడే పరిస్థితి ఈదేశంలో వస్తుందని హెచ్ఎం సీర్వాయి, బీఆర్ అంబేడ్కర్ వంటి న్యాయకోవిదులు కూడా ఊహించి ఉండరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఇవి కూడా చదవండి..

బెంగాల్‌లో బాబ్రీ మసీదు కట్టనీయం: అమిత్‌షా

ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు

Updated Date - Apr 22 , 2026 | 06:39 PM