Share News

ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:44 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌‌ను కలిసింది. ఖర్గే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపే ప్రతినిధి బృందం ఫిర్యాదు
BJP Deligation

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి 'టెర్రరిస్టు' అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌ (EC)ను కలిసింది. ఖర్గే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అత్యంత వివాదాస్పదమైన, వ్యక్తిగత దూషణగా బీజేపీ ప్రతినిధులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పించాలని కోరారు. ఈసీఐని కలిసిన ప్రతినిధి బృందంలో నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు. అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు ఉన్నారు.


ఈ సందర్భంగా మీడియాతో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈసీఐని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కలిసినట్టు చెప్పారు. ఎంతో బాధ, ఆగ్రహంతో తాము ఇక్కడకు వచ్చామన్నారు. ప్రధానమంత్రి మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అవమానించిన తీరే ఇందుకు కారణమని అన్నారు. ప్రధానమంత్రిని ఉగ్రవాదిగా పేర్కొనడం యావద్దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.


దీనికి ముందు, ఖర్గే వ్యాఖ్యల వివాదంపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ మంగళవారం ఒక లేఖ రాసింది. ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కిందకు వస్తుందని పేర్కొంది. భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 175 కింద ఇది నేరమని, పరువునష్టం కేసు వేసేందుకు అవసరమైన ప్రాథమిక సాక్ష్యంగా ఆయన వ్యాఖ్యలు నిలబడతాయని తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడి చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఈసీని కోరింది.


ఖర్గే వివరణ

అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుపై ఖర్గే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రశ్నిస్తూ, ఆ పార్టీ మోదీతో ఎలా చేతులు కలిపిందని ప్రశ్నించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు. అలాంటి వాళ్లతో అన్నాడీఎంకే కలవడమంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని విమర్శించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించడంతో ఆయన తిరిగి వివరణ ఇచ్చారు. మోదీని తాను ఎప్పుడూ ఉగ్రవాది అని అనలేదని, ప్రజలు, రాజకీయ పార్టీలను ఆయన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

ఖర్గే వ్యాఖ్యలు.. ప్రజలను అవమానించడమే

ప్రధాని మోదీ ఎంపీలపై నిందలు మోపారు!

Updated Date - Apr 22 , 2026 | 02:47 PM