ప్రధాని మోదీ ఎంపీలపై నిందలు మోపారు!
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:49 AM
జాతినుద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రసంగంలో విపక్ష ఎంపీలపై నిందలు మోపారని.. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమేనని ..
ఇది సభా హక్కుల ఉల్లంఘనే..చర్యలు తీసుకోండి.. మోదీ ప్రసంగంపై స్పీకర్‌కు కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీసు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల చేసిన ప్రసంగంలో విపక్ష ఎంపీలపై నిందలు మోపారని.. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రధానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సభా హక్కుల(ప్రివిలేజ్) ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ‘‘2029 నుంచి మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు లోక్‌సభలో వీగిపోయిన అనంతరం.. ఈ నెల 18న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో.. సదరు బిల్లు విషయంలో ఎంపీల ఓటింగ్ విధానంపై ఉద్దేశపూర్వకంగా తన సొంత అభిప్రాయాలను ఆపాదించారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. అంతేకాదు.. సభను సైతం ధిక్కరించడమే అవుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణకు లోక్‌సభ హక్కుల కమిటీకి నివేదించాలి.’’ అని వేణుగోపాల్ కోరారు. ఈ మేరకు లోక్‌సభ రూల్స్-222వ నిబంధన మేరకు ఆయన నోటీసులు ఇచ్చారు. అనంతరం.. ఆయన మాట్లాడుతూ.. 29 నిమిషాల ప్రధాని ప్రసంగం.. విపక్షాలను విమర్శించేందుకే సరిపోయిందని ఎద్దేవా చేశారు.