ఖర్గే వ్యాఖ్యలు.. ప్రజలను అవమానించడమే
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:01 AM
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీని ‘తీవ్రవాది’గా సంబోధించడం దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
ఆయనవి దిగజారుడు వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
అలాంటి భాష అనుచితం: బండి సంజయ్, లక్ష్మణ్
హైదరాబాద్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీని ‘తీవ్రవాది’గా సంబోధించడం దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. మూడోసారి ప్రధానిగా సేవలందిస్తున్న మోదీకి 25 ఏళ్ల పాలనా అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు. జకీర్ నాయిక్‌ను ‘శాంతి దూత’గా పేర్కొనడమేంటీ? అని ఆయన నిలదీశారు. మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీని ఖర్గే ఉగ్రవాది అని సంబోధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులతో కాంగ్రెస్ నాయకులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయాన్ని ఖర్గే గుర్తుపెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానిపై పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం.. ఆ పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. ఖర్గే వ్యాఖ్యలు పూర్తిగా అవమానకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘ప్రధానిని ‘టెర్రరిస్ట్’ అని సంబోధించడం అవమానకరం. ఇలాంటి భాష ప్రజల తీర్పును అవమానపరుస్తుంది’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలు అనుచితమైనవని, ఆమోదయోగ్యం కానివని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఖర్గే, ఎంకే స్టాలిన్, రాహుల్‌గాంధీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.