ED Raids IPAC Kolkata: ఈడీ రెయిడ్స్‌తో పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. ఐప్యాక్ చీఫ్ ఇంటికి సీఎం మమత
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:57 PM
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ వ్యవహారాలను పర్యవేక్షించే కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ రెయిడ్స్‌ను నిర్వహించింది. ఇదే సమయంలో ఆయన ఇంటికి పశ్చిమ బెంగాల్ సీఎం వెళ్లడం కలకలానికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ కలకలానికి దారి తీసింది. కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో రెయిడ్స్ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అక్కడకు చేరుకోవడంతో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. అక్రమ బొగ్గు తవ్వకాలు, అక్రమ నగదు రవాణా ఆరోపణలున్న నేపథ్యంలో ఈ సోదాలను నిర్వహించినట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐప్యాక్ కార్యాలయంలో కూడా సోదాలు జరిగాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎమ్‌సీకి కన్సల్టెన్సీ సంస్థగా ఐప్యాక్ సేవలందిస్తోంది. పార్టీ ఐటీ, మీడియా వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తోంది (ED Raids, CM Mamata Visits IPAC Chief's Residence).
ఈ పరిణామాలపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో రెయిడ్స్ జరుగుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ‘మా ఐటీ సెల్ చీఫ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మా పార్టీకి సంబంధించిన దస్త్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మా పార్టీ అభ్యర్థుల వివరాలు వాటిల్లో ఉన్నాయి. వాటిని వెనక్కు తీసుకున్నా’ అని సీఎం మీడియాకు చెప్పారు.
‘మా పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ తీసుకోవచ్చా? నేను ఇలాగే బీజేపీ ఆఫీసుకు వెళితే పరిస్థితి ఏమిటి? ఓటర్ జాబితా సమగ్ర సవరణ పేరిట ఇప్పటికే 5 లక్షల మంది పేర్లను తొలగించారు. కేవలం ఎన్నికలు జరగనున్నాయనే ఇలా చేస్తున్నారు’ అని అన్నారు. టీఎమ్‌సీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించాలని బీజేపీకి సవాలు విసిరారు. ‘మీరు (బీజేపీ) మమల్ని ఓడించలేనప్పుడు బెంగాల్‌కు ఎందుకు వస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షాను నియంత్రించాలని కూడా వ్యాఖ్యానించారు. బెంగాల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని కూడా అన్నారు.
మరోవైపు, సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా మండిపడ్డారు. పోలీసు కమిషనర్‌తో కలిసి సీఎం ఐప్యాక్ చీఫ్ ఇంటికి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధం, ఈడీ పనుల్లో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు. ఈడీ సోదాలతో కలవరపడ్డ సీఎం.. నగర కమిషనర్‌తో కలిసి ప్రతీక్ జైన్‌కు రక్షణగా ఆయన ఇంటికి వెళ్లారని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు.
ఇవీ చదవండి:
లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటుపై జస్టిస్ వర్మ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి! అతడి డబ్బాను చెక్ చేస్తే.. భారీ షాక్