Justice Verma Case: లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటుపై జస్టిస్ వర్మ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:52 PM
అవినీతి ఆరోపణల దర్యాప్తు కోసం లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటైన తీరును సవాలు చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో, ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం లోక్‌సభ విచారణ కమిటీ ఏర్పాటైన తీరును సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. జస్టిస్ వర్మ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. పార్లమెంటు ఉభయసభల తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు (SC Reserves Verdict in Justice Verma's Case).
విచారణ సందర్భంగా న్యాయవాదులు రోహత్గీ, లుథ్రా తమ వాదనలు వినిపిస్తూ పార్లమెంటరీ ప్లానల్ ఏర్పాటైన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ఒకేసారి అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదిస్తే ఉభయ సభలూ సంయుక్త దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ముకుల్ రోహత్గీ అన్నారు. అయితే, న్యాయమూర్తుల చట్టం-1968లో అలాంటి నిబంధన ఏదీ లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతిపాదిత అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించాక లోక్‌సభ స్పీకర్ దర్యాప్తు కమిటీని నియమించరాదన్న వాదనతోనూ సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. దర్యాప్తు కమిటీ ఏర్పాటులో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తున్నా, అది మొత్తం ప్రక్రియను నిలుపుదల చేసేంత తీవ్రమైనదా? కాదా? అన్నది తేల్చాల్సి ఉందని బుధవారం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో, సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి:
రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి! అతడి డబ్బాను చెక్ చేస్తే.. భారీ షాక్
అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్